Yaganti Temple: భక్తులను ఆశ్చర్యపరిచే నంది.. మనుషుల్లాగే విగ్రహం కూడా పెరుగుతుందట!
రాళ్లకు జీవం ఉంటుందా? అవి కూడా మనుషుల్లాగే పెరుగుతాయా? అనే ప్రశ్న సాధారణంగా ఎవరికైనా విచిత్రంగానే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే.. ఈ సందేహం సహజంగానే మనసులో ఉద్భవిస్తుంది. కారణం అక్కడ ఉన్న నంది విగ్రహమే. కాలక్రమేణా పెరుగుతున్నట్టు కనిపించే ఈ నంది విగ్రహం యాగంటి ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. భక్తుల విశ్వాసం, శాస్త్రీయ పరిశోధనలు, పురాణ గాథలు అన్నీ కలిసి ఈ క్షేత్రాన్ని ఒక మహా మిస్టరీగా నిలబెడుతున్నాయి.
కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమ కొలువుదీరిన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ఆలయానికి సంబంధించిన మహిమలు అనేకం ఉన్నప్పటికీ, ఇక్కడి నంది విగ్రహం పెరుగుతుండటమే అత్యంత విశేషంగా భావిస్తారు. ఆలయం ముందుభాగంలో భూమిపై విరాజిల్లుతున్న ఈ నంది విగ్రహం చూస్తే.. లేచి పరుగెత్తేందుకు సిద్ధంగా ఉన్నట్లే అనిపిస్తుంది.
ఈ మిస్టరీ వెనుక ఉన్న కథను తెలుసుకోవాలంటే యాగంటి స్థల పురాణంలోకి వెళ్లాల్సిందే. వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారత యాత్రలో భాగంగా మహర్షి అగస్త్యుడు నల్లమల అరణ్యాలకు చేరుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కైలాసాన్ని తలపించే పవిత్ర భూమిగా భావించిన అగస్త్యుడు.. ఇక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ సంప్రదాయంలో నిర్మించాలనుకున్నాడు. ఆలయ ప్రతిష్ఠ కోసం వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కిస్తున్న సమయంలో, అనుకోకుండా బొటనవేలు విరిగిపోయింది.
అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టించడం అపశకునమని భావించిన అగస్త్యుడు తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఘోర తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై.. ఈ ప్రాంతం శైవ క్షేత్రంగా మారుతుందని, తానే ఇక్కడ ఉమామహేశ్వర స్వామిగా కొలువుదీరుతానని వరం ఇచ్చాడట. దీంతో అగస్త్యుడు వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సమీపంలోని ఒక గుహలో ప్రతిష్టించి, ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు.
ఆలయం నిర్మాణం పూర్తైన కొద్ది రోజులకే ఆలయం ఎదుట ఒక చిన్న నంది విగ్రహం స్వయంభువుగా వెలిసిందని స్థల పురాణం పేర్కొంటుంది. అదే నంది కాలక్రమేణా పెరుగుతూ వస్తోందన్నది భక్తుల నమ్మకం. వేంకటేశ్వర స్వామి గుహకు పక్కనే ఉన్న మరో గుహను శివగుహగా పిలుస్తారు. అక్కడే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లు స్థానికులు చెబుతారు.
చోళులు, పల్లవులు, చాళుక్యులు వంటి రాజవంశాలు ఐదవ శతాబ్దం నుంచే ఈ ఆలయంలో పూజలు నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహర బుక్కరాయలు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించి వైభవాన్ని తీసుకొచ్చారు.
నంది విగ్రహం పెరుగుతోందన్న అంశంపై భక్తుల్లో ఎన్నో కథనాలు వినిపిస్తుంటాయి. సుమారు 400 ఏళ్ల క్రితం ఈ నంది చాలా చిన్నగా ఉండేదని, అప్పట్లో దాని చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేవారని చెబుతారు. ప్రస్తుతం నంది విగ్రహం పరిమాణం పెరగడంతో ప్రదక్షిణలు చేయడం సాధ్యం కావడం లేదని స్థానికులు అంటున్నారు. పాత ఫోటోలు లేదా వీడియో ఆధారాలు లేనప్పటికీ, నంది విగ్రహం పరిమాణంలో మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని భక్తుల అభిప్రాయం.
ఈ అంశంపై భారత పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు నిర్వహించారు. వారి అధ్యయనం ప్రకారం.. ఈ నంది విగ్రహం ప్రతి 20 ఏళ్లకు సుమారు ఒక అంగుళం చొప్పున పెరుగుతోందని వెల్లడైంది. అంటే ఏడాదికి సుమారు ఒక మిల్లీమీటరు మేర ఎదుగుతోంది. నంది చుట్టూ ఉన్న స్తంభాలు, నిర్మాణాల ఆధారంగా ఈ మార్పును గుర్తించవచ్చని పురావస్తు నిపుణులు చెబుతున్నారు.
నంది పెరుగుదల వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉందని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. యూరప్‌లోని రొమేనియాలో కూడా రాళ్లు పెరుగుతున్న ఉదాహరణలు ఉన్నాయని వారు చెబుతున్నారు. అక్కడి రాళ్లలో కాల్షియం కార్బొనేట్, సోడియం సిలికేట్ వంటి రసాయన పదార్థాలు అధికంగా ఉండటం వల్ల వర్షాల సమయంలో రసాయనిక చర్యలు జరిగి అవి పెరుగుతాయట. కొన్ని సందర్భాల్లో ఆ రాళ్ల నుంచి చిన్న రాళ్లు విడిపోయి కొత్తగా ఎదుగుతాయని కూడా పరిశోధనలు చెబుతున్నాయి.
యాగంటి నంది విగ్రహంలో కూడా ఇదే తరహా ఖనిజాలు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. అయితే రొమేనియా రాళ్లకు, యాగంటి నందికి మధ్య ప్రధాన తేడా ఏమిటంటే.. ఈ నంది విగ్రహం నేరుగా వర్షానికి తడవదు. ఆలయ ప్రాంగణంలో ఉండటంతో గాల్లోని తేమను మాత్రమే గ్రహించి, నెమ్మదిగా రసాయనిక చర్యకు లోనవుతుందని చెబుతున్నారు.
మరి ఇతర శివాలయాల్లో ఉన్న నంది విగ్రహాలు ఎందుకు పెరగడం లేదన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. వాటిపై విస్తృత పరిశోధనలు జరగకపోవడమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే భక్తులు ఇప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను శివుడి మహిమగానే విశ్వసిస్తున్నారు.
కలియుగాంతంలో యాగంటి నంది లేచి రంకెలేస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఉన్నట్లు పెద్దలు చెబుతారు. అందుకే నంది విగ్రహం రోజు రోజుకు ఎదుగుతోందన్న నమ్మకం బలంగా ఉంది. అంతేకాదు.. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక్క కాకి కూడా కనిపించదు. అగస్త్యుడి తపస్సును భంగం చేసిన కాకులపై ఆయన శాపం కారణంగానే అక్కడ కాకులు రావని స్థానిక కథనం.
కాకులేని క్షేత్రంలో తాను ఉండనని శనిదేవుడు చెప్పడంతో, యాగంటి ఆలయంలో నవగ్రహాల విగ్రహాలు కూడా ఉండవు. అంతేకాదు, ఆలయ కోనేరులో నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ.. ఏడాది పొడవునా నీటితో నిండి ఉంటుంది. ఇవన్నీ యాగంటి క్షేత్రాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యంగా నిలబెడుతున్నాయి.
ALSO RAED: NBEMS: నీట్ పీజీ, ఎండీఎస్-2026 పరీక్షల షెడ్యూల్ విడుదల