CM Revanth Reddy: భద్రాద్రి రాముడిపై ఆన..
2029లో 117 సీట్లతో మళ్లీ మనదే పీఠం!
'రైతు ఆశీర్వాద సభ'లో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ రాజకీయంగానూ, రైతు సంక్షేమ పరంగానూ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం చింతకాని మండలం జగన్నాథపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా తుది విడత నిధులుగా రూ.1009 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ నిధుల విడుదలతో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పెట్టుబడి సాయంగా మొత్తం రూ.8,759 కోట్లను అందించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 74 లక్షల మంది రైతులకు చెందిన 1.45 కోట్ల ఎకరాల భూములకు పెట్టుబడి సాయం విజయవంతంగా చేరిందని పేర్కొన్నారు. రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధమన్న సీఎం
సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఖమ్మం జిల్లాకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని గుర్తు చేశారు. తన రాజకీయ ప్రయాణంలో ఖమ్మం జిల్లా ఎంతో కీలకమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. 2023 జులైలో ఇదే జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ అహంకార పాలనను వ్యతిరేకిస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని, ఇప్పుడు మళ్లీ అదే జులై నెలలో రైతులు, ప్రజలు ప్రజాపాలనకు ఆశీర్వాదం అందించేందుకు పెద్దఎత్తున సభకు తరలివచ్చారని పేర్కొన్నారు. ఈ స్పందన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్‌పై విమర్శలు.. ఎన్నికల ఫలితాల ప్రస్తావన
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇప్పటికే గట్టి తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ మళ్లీ పునరుద్ధరించే పరిస్థితి లేదని ప్రజలే నిర్ణయించారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో తమ విజయంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని గుర్తుచేస్తూ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడే ధైర్యంగా చెప్పానని తెలిపారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో మరో 2 స్థానాలు సాధించి తమ బలం మరింత పెంచుకున్నామని చెప్పారు. ప్రజల విశ్వాసమే తమ ప్రభుత్వానికి అతిపెద్ద బలమని ఆయన పేర్కొన్నారు.
2029 ఎన్నికలపై ధీమా వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి
భవిష్యత్తు ఎన్నికలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2029 జూన్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుందని, దాంతో పార్లమెంట్ స్థానాలు 25కు, అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని తెలిపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 117 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని సాక్షిగా ఈ మాట చెబుతున్నానని, ఇది తన వ్యక్తిగత నమ్మకం మాత్రమే కాదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త విశ్వాసమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ALSO READ: Employee: సెలవుల్లోనూ పని.. అర్ధరాత్రి ఫోన్.. కట్‌చేస్తే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా..?