🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 July 2026, 8:14 am Posted by : STAR TRINETHRAM

Telangana: 2 కిలోల బంగారం.. కోట్ల ఆస్తులు.. డీఎస్పీ చిట్టా చాంతాండంత..!

News Image
Telangana: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల కేసులో హైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న భీమ్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు చర్యలను మరింత వేగవంతం చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన భీమ్‌రెడ్డి ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ కొనసాగించారు. తర్వాత న్యాయమూర్తి నివాసంలో భీమ్‌రెడ్డిని హాజరుపరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు భీమ్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో వెలుగులోకి వస్తున్న అంశాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం భీమ్‌రెడ్డి నివాసం, కార్యాలయం, బంధువులు, బినామీలకు సంబంధించిన మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఒకేసారి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున ఆస్తులకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు రూ.300 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, భీమ్‌రెడ్డి నివాసంలో స్వాధీనం చేసుకున్న ఒక రహస్య డైరీని దర్యాప్తులో అత్యంత కీలక ఆధారంగా పరిగణిస్తున్నారు. ఆ డైరీలో 15 మందికి పైగా బినామీల వివరాలు నమోదై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే ఆధారంగా వారం క్రితం జరిగిన రూ.3 కోట్ల ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రత్యేకంగా విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంలో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే భీమ్‌రెడ్డికి సంబంధించిన పలు బ్యాంకు లాకర్లను కోర్టు అనుమతితో తెరిచి అందులోని వివరాలను కూడా పరిశీలించేందుకు చర్యలు చేపడుతున్నారు. గతంలో భూముల సెటిల్‌మెంట్ వ్యవహారాల్లో కొంతమందితో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

సోదాల సమయంలో భీమ్‌రెడ్డి నివాసం, బినామీలకు సంబంధించిన ప్రదేశాల నుంచి సుమారు 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43.6 లక్షల నగదు, 23 విదేశీ మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మణికొండ, టెలికాం నగర్ ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, ఇబ్రహీంబాగ్‌లో విలాసవంతమైన విల్లా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వందల ఎకరాల వ్యవసాయ భూములు కూడా ఆయనకు సంబంధించినవిగా అనుమానిస్తున్నారు. మరోవైపు గతంలో భీమ్‌రెడ్డి వద్ద పనిచేసిన మాజీ హోంగార్డు, వాచ్‌మన్ పేర్లపై కోట్ల రూపాయల విలువైన బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించడం మరింత సంచలనంగా మారింది. సోదాల సమయంలో భీమ్‌రెడ్డి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించగా, కోలుకున్న అనంతరం ఆయనను అధికారికంగా అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసులో బినామీల పాత్ర, ఆస్తుల మూలాలు, ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ALSO READ: Marriage Age: అబ్బాయికి 28.. అమ్మాయికి 26 ఏళ్లు..!
🏠 Home