🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 June 2026, 11:37 am Posted by : STAR TRINETHRAM

Accident: అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..?

News Image
Accident: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు నీటితో నింపిన టబ్‌లో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో కూడా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతిచెందిన చిన్నారిని సుబరి మానసగా గుర్తించారు. ఆమె తల్లిదండ్రులు సుబరి బంధు సురభి, రాజకుమారి సుబరి. వీరికి మొత్తం ముగ్గురు కుమార్తెలు ఉండగా, మానస కుటుంబంలో చిన్నది. పెద్ద కుమార్తె మిల్లి సుబరి వయస్సు 5 సంవత్సరాలు కాగా, రెండో కుమార్తె సుమిత్ర వయస్సు 4 సంవత్సరాలు.

కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా గునుపూర్ సమీపంలోని చిన్నఆసరి గ్రామం నుంచి విజయనగరం జిల్లాలోని కారాడ గ్రామానికి వలస వచ్చారు. అక్కడ స్థానిక రైతు తోటకూర వీరభద్రరావుకు చెందిన పామాయిల్ తోటలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి ఇంట్లో విద్యుత్ ఫ్యాన్ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులు దానిని మరమ్మతు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఇంటి వద్ద నీటితో నింపి ఉంచిన టబ్ సమీపంలో చిన్నారి మానస ఒంటరిగా ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. కొంతసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు. అనంతరం టబ్‌లో అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మానస ప్రతిరోజూ తన ఇద్దరు అక్కలతో కలిసి అదే టబ్‌లోని నీటితో ఆడుకునేది. సాధారణంగా అక్కలు ఆమెపై ఎప్పుడూ నిఘా ఉంచేవారు. అయితే ఘటన జరిగిన రాత్రి ఇద్దరు అక్కలు ముందుగానే నిద్రపోవడం, తల్లిదండ్రులు ఫ్యాన్ మరమ్మతు పనిలో నిమగ్నమవడం వల్ల చిన్నారిపై దృష్టి సారించలేకపోయారు. ఈ పరిస్థితుల్లో జరిగిన ప్రమాదం కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామస్థులు కూడా వారిని ఓదార్చేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారులు ఉన్న ఇళ్లలో నీటితో నింపిన టబ్బులు, బకెట్లు, ఇతర పాత్రలను నిర్లక్ష్యంగా ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులను ఒక్క క్షణం కూడా పర్యవేక్షణ లేకుండా వదిలేయకూడదని, ఇలాంటి చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద విషాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ALSO READ: Telangana: మేకులు దింపిన బొమ్మ.. పక్కనే బలి ఇచ్చిన మేక.. బాబోయ్..
🏠 Home