🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 June 2026, 1:32 pm Posted by : STAR TRINETHRAM

Hyderabad: ఫాస్ట్ ఫుడ్ గోదాములో భయంకర దృశ్యాలు!

News Image
Hyderabad: హైదరాబాద్‌లో కల్తీ ఆహారం, నాణ్యతలేని ఆహార పదార్థాల తయారీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 2 రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీలు ఆహార వ్యాపారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతున్న అపరిశుభ్ర ఆహార తయారీ కేంద్రాలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న గోదాములపై వరుసగా దాడులు నిర్వహిస్తూ కఠిన చర్యలు చేపడుతున్నారు. ఆహార భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

తాజాగా చార్మినార్‌ పరిధిలోని హుస్సేనీఆలం ప్రాంతంలో ఉన్న ‘అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్’ గోదాముపై హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోదామును భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఆహార పదార్థాల తయారీలో నిషేధిత కృత్రిమ రంగులను వినియోగిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఒకసారి ఉపయోగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్లు తనిఖీల్లో తేలింది.

తనిఖీల సందర్భంగా గోదాములో అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాల తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అక్కడి నుంచి 110 కిలోల ఫ్రైడ్ చికెన్‌, 90 లీటర్ల వంట నూనెతో పాటు ఆహార తయారీలో ఉపయోగిస్తున్న కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు గోదాముకు సంబంధించిన ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇటీవల నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార నిల్వ కేంద్రాలపై నిర్వహించిన తనిఖీల్లో కూడా నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో ఆహార భద్రతపై మరింత కఠిన నిఘా కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కల్తీ ఆహారంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

అనుమానాస్పద ఆహార పదార్థాలు, నాణ్యతలేని ఆహార తయారీ లేదా కల్తీ ఆహార విక్రయాలపై సమాచారం ఉన్నవారు వెంటనే 8712661212 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. ప్రజల సహకారంతోనే ఆహార భద్రతను మరింత బలోపేతం చేయగలమని పేర్కొన్నారు.

ALSO READ: Watch Video: డ్రైవర్ పిచ్చి పని.. జాతీయ రహదారిపై భారీ కలకలం!
🏠 Home