🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 June 2026, 10:06 pm Posted by : STAR TRINETHRAM

Haunted 3D Returns: థియేటర్లలో దుమ్మురేపుతున్న హారర్ సినిమా.. ఒక్కో సీన్ వేరేలెవల్..

News Image
Haunted 3D Returns: హారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంటుంది. మంచి కథ, భయపెట్టే సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథనంతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. తాజాగా గత వారం థియేటర్లలో విడుదలైన 6 కొత్త చిత్రాల మధ్య జరిగిన బాక్సాఫీస్ పోరులో ఓ హారర్ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలకు ముందు తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొన్న ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణతో వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఆ చిత్రం మరేదో కాదు.. ‘హాంటెడ్ 3D రిటర్న్స్’.

హారర్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విక్రమ్ భట్ 2011లో తెరకెక్కించిన ‘హాంటెడ్ 3D’ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఆ విజయానంతరం ఈ కథకు కొనసాగింపుగా ‘హాంటెడ్ 3D రిటర్న్స్’ను ప్రకటించగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే సినిమా ప్రచార చిత్రాలు విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రైలర్ చూసిన కొందరు ప్రేక్షకులు, నెటిజన్లు చిత్రంపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినిమాలోని కొన్ని దృశ్యాలు కృత్రిమ మేధస్సు సాయంతో రూపొందించారని తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నటీనటుల ఎంపికపై కూడా ట్రోలింగ్ జరిగింది.

అయితే విడుదల అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను చూసిన తర్వాత కథ, భయానక సన్నివేశాలు, నేపథ్య సంగీతం, ఉత్కంఠభరితమైన మలుపులు నచ్చడంతో చిత్రానికి మంచి స్పందన లభించింది. దీంతో మొదటి రోజు నుంచే ఈ సినిమా వసూళ్ల పరంగా సత్తా చాటింది. నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహా అక్షయ్ అలియాస్ మిమో ప్రధాన పాత్రలో నటించగా, చేత్నా పాండే కథానాయికగా కనిపించింది. వీరి నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో ముందస్తు బుకింగ్‌లు నమోదయ్యాయి. విడుదలైన శుక్రవారం రోజునే 2900కు పైగా ప్రదర్శనలు లభించగా, అదే రోజు రూ.2.50 కోట్లు వసూలు చేసింది. శనివారం వసూళ్లు మరింత పెరిగి రూ.3.25 కోట్లకు చేరుకోగా, ఆదివారం రూ.3.60 కోట్లు రాబట్టింది. ఆదివారం ఒక్కరోజే 4100 ప్రదర్శనలతో థియేటర్లలో సందడి చేసింది. ఎలాంటి భారీ ప్రచార కార్యక్రమాలు లేకుండానే తొలి వారాంతంలో మొత్తం రూ.9.35 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. విడుదలైన ఇతర చిత్రాలను వెనక్కి నెట్టి ఈ హారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చాటింది.

ఈ వారంలో విడుదలైన ఇతర చిత్రాల వసూళ్లతో పోలిస్తే ‘హాంటెడ్ 3D రిటర్న్స్’ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. ‘మై వాప్ ఆవుంగా’ చిత్రం రూ.5.50 కోట్లు, ‘భారత్ భాగ్య విధాత’ రూ.4.25 కోట్లు, ‘గవర్నర్’ రూ.3.45 కోట్లు, ‘డిస్క్లోజర్ డే’ రూ.6.40 కోట్లు, ‘బ్యాక్‌రూమ్స్’ రూ.3.45 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. దీంతో మొత్తం 6 చిత్రాల మధ్య జరిగిన పోటీలో ‘హాంటెడ్ 3D రిటర్న్స్’ విజేతగా నిలిచింది. విడుదలకు ముందు విమర్శలు ఎదుర్కొన్న సినిమా, విడుదల తర్వాత ప్రేక్షకుల మద్దతుతో విజయపథంలో దూసుకెళ్లడం ప్రస్తుతం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: Telangana: సన్న వడ్లు, ఎరువులపై సర్కార్ కీలక ఆదేశాలు..!
🏠 Home