🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 June 2026, 12:34 pm Posted by : STAR TRINETHRAM

Ayushman Bharat: రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్..

News Image
Ayushman Bharat: ఆరోగ్య సేవలను పేదలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఆయుష్మాన్ భారత్ పేరుతో అమలవుతున్న ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం అందిస్తున్నారు. ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లించకుండా చికిత్స పొందే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తోంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఒక పెద్ద భరోసాగా మారింది.

గత కొన్నేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ పథకం పరిధి నిరంతరం విస్తరిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా జారీ చేసిన ఆయుష్మాన్ భారత్ కార్డుల సంఖ్య 44 కోట్లకు చేరుకుంది. ఈ పథకం ద్వారా సుమారు 12 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. దేశ జనాభాలో దాదాపు 40 శాతం మందికి ఈ పథకం కింద సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణ లభిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఇది కీలక రక్షణ కవచంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ పథకాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా కొత్త వర్గాలను కూడా చేర్చుతోంది. మార్చి 2024లో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 37 లక్షల ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల కుటుంబాలను కూడా ఈ పథకంలో భాగస్వామ్యం చేసింది. అనంతరం 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన 6 కోట్ల మంది వృద్ధులను కూడా పథకంలో చేర్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. వీరు సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన వారిగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ వృద్ధులకు సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందించడం ఈ పథకంలోని ప్రత్యేకతగా నిలిచింది.

ఆరోగ్య రంగంతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుపై కూడా కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాలను విడుదల చేసింది. పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనం అందించేందుకు 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది. అలాగే పేదల గృహావసరాలను తీర్చే లక్ష్యంతో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల శాశ్వత గృహాలను నిర్మించినట్లు పేర్కొంది. గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేసే లక్ష్యంతో ప్రారంభించిన జన్ ధన్ పథకం కూడా గణనీయమైన ఫలితాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో జన్ ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 58.15 కోట్లకు చేరుకుంది. ఈ ఖాతాల్లో మొత్తం డిపాజిట్ల విలువ రూ.3 లక్షల కోట్లను దాటినట్లు వెల్లడించింది. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం మొత్తం జన్ ధన్ ఖాతాల్లో 56 శాతం మహిళల పేర్లపైనే ఉండటం విశేషం. మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించడంలో ఈ పథకం ప్రభావవంతంగా పనిచేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Money Management: జీతం డబ్బులు త్వరగా అయిపోతున్నాయా..?
🏠 Home