🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 June 2026, 10:23 pm Posted by : STAR TRINETHRAM

CM Assets: దేశంలో ధనిక ముఖ్యమంత్రులు ఎవరు..? రెండో స్థానంలో తెలుగు సీఎం

News Image
CM Assets: దేశ రాజకీయాల్లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మరో కారణంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు. భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ల ప్రకారం.. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.1,413 కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాల ఆధారంగా దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలోని హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల కంటే కూడా ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ చాలా ఎక్కువగా ఉండటం విశేషంగా మారింది.

సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ.931 కోట్లు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రూ.648 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన ఆస్తుల విలువను రూ.30 కోట్లుగా ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కేరళ ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ తక్కువ ఆస్తులు కలిగిన నేతగా నిలిచారు. ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ.6.6 కోట్లు మాత్రమే.

అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నిర్వహించిన అఫిడవిట్‌ల విశ్లేషణలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. బిహార్, ఛండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖాండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ.106.75 కోట్లు మాత్రమేనని నివేదిక పేర్కొంది. ఈ లెక్కన చూస్తే డీకే శివకుమార్ ఒక్కరే ఆ 10 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల కంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ సంపద కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ గణాంకం దేశవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

డీకే శివకుమార్ ఆస్తులకు సంబంధించి మరో అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఆగస్టులో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చింది. అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కనకపుర నియోజకవర్గం కూడా ఈ జిల్లాలోనే ఉంది. జిల్లా పేరు మారిన తర్వాత భూముల విలువలు పెరుగుతాయని ఆయన అప్పట్లో ప్రకటించారు. ప్రస్తుతం డీకే శివకుమార్‌కు ఈ జిల్లాలో రూ.10.37 కోట్ల విలువైన 71 ఎకరాల భూమి ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడైంది.

అదేవిధంగా ఆయన సోదరుడు, బెంగళూరు రూరల్ మాజీ ఎంపీ డీకే సురేష్‌‌కు 93.97 ఎకరాల వ్యవసాయ మరియు ఇతర ఆస్తులు ఉన్నట్లు సమాచారం. వాటి విలువను ఆయన అఫిడవిట్‌లో రూ.8.35 కోట్లుగా పేర్కొన్నారు. రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చిన అనంతరం ఆ ప్రాంతంలోని భూముల ధరలు రెట్టింపు నుంచి మూడు రెట్లు వరకు పెరిగినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు కూడా ప్రస్తుతం రాజకీయంగా మరియు ఆర్థికంగా విస్తృత చర్చకు కారణమవుతున్నాయి.

ALSO READ: Hyderabad: భార్య గొంతు కోసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త
🏠 Home