🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 25 April 2026, 10:31 am Posted by : STAR TRINETHRAM

Telangana Rastra Sena: కొత్త విప్లవం.. తెలంగాణలో కవిత కొత్త పార్టీ

News Image
Telangana Rastra Sena: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ ప్రాంతంలోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన సభలో ఆమె పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించిన కవిత.. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండాను ప్రజల ముందుంచారు. ఆ జెండా మధ్యలో తెలంగాణ ఆకృతిని ప్రతిష్టించి, దానిపై పార్టీ పేరును సూచించే అక్షరాలను ప్రతిబింబించారు. అనంతరం సభలో మాట్లాడిన కవిత తన పార్టీ ఏర్పాటుకు కారణమైన అంశాలను వివరిస్తూ, తెలంగాణ ఆత్మ దెబ్బతిన్నదనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ రోజు తన జీవితంలో మరపురాని రోజుగా నిలిచిందని పేర్కొన్న కవిత.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ప్రజల ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యమ నాయకుడిగా నిలిచిన కేసీఆర్ అభివృద్ధి దిశలో సాగించిన ప్రయాణం ప్రస్తుతం గాడితప్పిందని విమర్శించారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో తాను కూడా భాగమని అంగీకరిస్తూ, ప్రజల ముందు క్షమాపణ చెబుతున్నానని వెల్లడించారు. ఆ తప్పులను సరిదిద్దుకునే సంకల్పంతోనే కొత్త పార్టీ స్థాపనకు ముందుకొచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని ఆరోపిస్తూ, అందుకే తెలంగాణ రాష్ట్ర సేన రూపుదిద్దుకుందని స్పష్టం చేశారు.

తాను తెలంగాణలోని 3.5 కోట్ల ప్రజలకు తల్లిగా మారాలని కోరుకుంటున్నానని కవిత పేర్కొన్నారు. అమ్మతనంతో పాలన సాగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. సామాజిక న్యాయం లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని కోరుతూ, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఏర్పాటుపై ఆసక్తి లేదని విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నీళ్లు, నిధులు, నియామకాల అంశాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గతంలో టీఆర్ఎస్ కోసం పని చేసిన తాను, అప్పటి కేసీఆర్‌కు ఇప్పటి కేసీఆర్‌కు ఎంతో తేడా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని, ప్రజలకు ఇబ్బందులు వచ్చినా స్పందించడం లేదని విమర్శించారు. అధికారం ముందు అనుబంధాలు తగ్గిపోయాయని, రాజకీయ పరిణతి లోపించిందని కూడా వ్యాఖ్యానించారు.

తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మంచిదేనని చెప్పిన కవిత.. ఆ పార్టీలో కొనసాగి తాను బలంగా పోరాడలేకపోయానని అన్నారు. ఇప్పుడు రాష్ట్రం కోసం స్వేచ్ఛగా పోరాడతానని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినందుకే తనను పక్కన పెట్టారని ఆరోపించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తమ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుందని, మరో 2 సంవత్సరాల తరువాత అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సభకు ముందు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి పార్టీ శ్రేణులతో కలిసి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్త మార్పులకు నాంది పలుకుతున్నామని తెలిపారు. తాను తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా అవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

ALSO READ: Interesting Facts: ఏడు గుర్రాల ఫొటో ఇంట్లో పెడుతున్నారా?
🏠 Home