🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 May 2026, 4:07 pm Posted by : STAR TRINETHRAM

Congress: రెండున్నరేళ్ల విధ్వంసం.. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ పాలు!

News Image

తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన!
ప్రజా భవన్‌ ముందు కంచెలు కూలిస్తే.. ప్రజల జీవితాలు మారుతాయా?
తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు!
సంక్షేమానికి పాతర- రైతులకు ద్రోహం
బ్రాండ్ హైదరాబాద్ ఖతం- రియల్ ఎస్టేట్ ఢమాల్!
అబద్ధపు హామీలు - నిరుద్యోగుల ఆక్రందన!
చీకటి రోజులు - ప్రజా వ్యతిరేక నిర్ణయాలు!
రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ అరాచక పాలనపై స్పెషల్ ఫోకస్

Congress: తెలంగాణ సమాజం మార్పును కోరుకుంటే.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు కాస్తా వినాశనంగా మారి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ నిర్మించిన బంగారు తెలంగాణను రెండున్నరేళ్లలోనే చీకటి తెలంగాణగా మార్చేసింది రేవంత్ ప్రభుత్వం. మార్పు పేరుతో అభివృద్ధికి పాతరేసి, సంక్షేమాన్ని సమాధి చేస్తూ.. హైడ్రా పేరుతో అలజడి, అక్రమ అరెస్టులతో అరాచకం సృష్టిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టామని, ఇనుప కంచెలు తొలగించామని గొప్పలు చెప్పుకున్న రేవంత్ సర్కార్.. సామాన్యుడి కష్టాలను మాత్రం తీర్చలేకపోయింది. కంచెలు పోయినా.. సామాన్యుడికి సచివాలయంలోకి ప్రవేశం లేదు. మొదట్లో ఆర్భాటం చేసిన ప్రజా దర్బార్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. వేల సంఖ్యలో వచ్చిన అర్జీలు బుట్టదాఖలయ్యాయి.

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి.. మార్పు తెస్తామని ప్రగల్భాలు పలికారు. నిజమే.. ఆయన చెప్పినట్లే తెలంగాణలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఏమిటంటే.. మళ్ళీ పాత సమైక్యాంధ్ర పాలన నాటి చీకటి రోజులు, కరెంటు కోతలు, నీటి కటకటలు తిరిగి రావడం. సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణకు చేసిన అన్యాయం గుర్తుకు తెచ్చుకుంటే కన్నీరు రాక మానదు. కరెంట్‌ లేక, ఉపాధి లేక, సాగు, మంచి నీటి కటకట. తెలంగాణ అంటేనే ఓ ఎడారిలా తయారైంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసి తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చారు. మిషన్ భగీరథతో ప్రజల ఇంటి ముందుకే మంచినీరు తీసుకొచ్చారు. కేసీఆర్ సర్కార్ వచ్చిన నెలరోజుల్లోనే కరెంట్ కష్టాలను తీర్చి.. నాడు సమైక్య పాలనలో కరెంట్ ఉంటే వార్త.. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ పోతే వార్త అన్నట్లుగా తీర్చిదిద్దారు. సాగునీటి రంగంలో విప్లవాన్ని తీసుకొస్తూ కాళేశ్వరంతో మండే వేసవిలోనూ చెరువులను మత్తడి దూకించిన అపర భగీరథుడు కేసీఆర్. ఇలా ఒకటి రెండు కాదు అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్ది పల్లెలను దేశానికే పట్టుకొమ్మలుగా మార్చారు.

తీరా పదేళ్ల తర్వాత ఇప్పుడు సీన్ పూర్తిగా రీవర్స్ అయింది. కేసీఆర్‌ కంటే బెటర్ పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గుంపు మేస్త్రి పాలనలో అంధకారంలోకి వెళ్లిపోయింది. ఆరు గ్యారెంటీలు.. 420 మామీలతో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు రేవంత్.

రైతు భరోసాకు అష్టకష్టాలు..

రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ పథకం అమలుకు సవాలక్ష సాకులు వెతుకుతోంది. గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిన 'రైతు బంధు'ను కూడా సమర్థవంతంగా అమలు చేయలేక చేతులెత్తేసింది. సాగునీటి నిర్వహణలో విఫలమై, ఎండిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీరు పెడుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు పంపడంలో నిమగ్నమయ్యారు. రైతు బంధుకు రాం రాం.. దళిత బంధుకు జై భీం.. కేసీఆర్ కిట్‌కు మంగళం ఇలా గత ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేలా తెచ్చిన సంక్షేమ పథకాలన్ని ఇప్పుడు కాల గర్భంలో కలిసిపోయాయి.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆక్రంధన

పంట చేతికొచ్చినా, కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరువకపోవడంతో వడ్లు రోడ్డుపాలవుతున్నాయి. మక్క రైతులు గన్నీ సంచుల కొరత, మద్దతు ధర దక్కక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ ఉందని క్వింటాలుకు 5 కిలోల వరకు కోత.. ఇక యూరియా కోసం రైతులు అరిగోస పడే పరిస్థితి నెలకొంది. కేసీఆర్ పాలనలో యూరియా సజావుగా అందగా.. ఇప్పుడు యూరియా కోసం రైతులు రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి నెలకొంది. పదేళ్ల తర్వాత మళ్ళీ యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టాల్సిన దుస్థితిని రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు.

'హైడ్రా'.. పేదల గుండెల్లో గుబులు!

ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో హైడ్రాను అస్త్రంగా చేసుకుని రేవంత్ రెడ్డి సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది, ప్రభుత్వమే నల్లా కనెక్షన్ ఇచ్చింది.. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం బుల్డోజర్‌లతో కూల్చేస్తోంది. పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా, బడా బాబుల ఆక్రమణల జోలికి వెళ్లకపోవడం ఈ ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనమని ప్రజలు చెప్పకోని సందర్భాలు లేకపోలేదు.

బ్రాండ్ హైదరాబాద్‌ ఖతం..

దశాబ్ద కాలంగా కేసీఆర్ నిర్మించిన 'బ్రాండ్ హైదరాబాద్'ను కాంగ్రెస్ మంటగలిపింది. ప్రపంచపటంలో వెలిగిన హైదరాబాద్ నగరం నేడు కళ తప్పింది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఇన్వెస్టర్లు పారిపోతున్నారు. హైడ్రా పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పకూల్చారు.

కొత్త ఐటీ కంపెనీలు రాకపోగా, ఉన్న కంపెనీలు తమ కార్యకలాపాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు 40% పడిపోయాయి. సచివాలయంలో మంత్రుల కంటే వారి కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిపోయింది. అసలు పదవుల్లో లేని సీఎం సోదరులు సమీక్షలు నిర్వహిస్తుంటే.. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ప్రశ్నించే వారిని ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిని సైతం జైలుకు పంపే అధ్వాన్న పాలన సాగుతోంది.

చీకటి రోజులు - ప్రజా వ్యతిరేక నిర్ణయాలు..

తెలంగాణను మళ్లీ కరెంట్ కోతల రాష్ట్రంగా మార్చారు. సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఆపేసి పంట ఎండిపోయేలా చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఆటో డ్రైవర్ల పొట్టకొట్టారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది ఆటోడ్రైవర్లు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం చేయని మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు రేవంత్.

ఆరు గ్యారెంటీలు.. అన్నీ 420 హామీలే!

మహాలక్ష్మి పథకం (మహిళల కోసం) నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అడిగే నాథుడే లేడు. కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డల వివాహానికి లక్ష రూపాలయ ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏ ఒక్కరికి తులం బంగారం ఇచ్చిన పరిస్థితి లేదు. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ అని ఉదరగొట్టారు.. కానీ అది పూర్తిస్థాయిలో అమలైందా అంటే ఆ పార్టీ నేతలే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు నెలకు రూ.4,000 పెన్షన్ అన్నారు. కానీ ఉన్న పెన్షన్‌లే ఇవ్వడానికి అష్టకష్టాలు పడుతున్నారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.

ధరణీ స్థానంలో తెచ్చిన భూమాత పోర్టల్‌ అట్టర్‌ ఫ్లాప్. భూమాత పోర్టల్‌లో జరిగిన కుంభకోణంతో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ.10 లక్షలు వడ్డీ లేని రుణం అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ.10 వేలు, 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ.3 వేల పెన్షన్, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షలు, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజూ 'ప్రజాదర్భార్' ఏర్పాటు ఇలా రేవంత్ సర్కార్ ఇచ్చిన ప్రతీ హామీ బుట్టాదాఖలైంది.

ఢిల్లీకి బానిసత్వం!

ఒకప్పుడు స్వయంపాలనలో గర్వంగా ఉన్న తెలంగాణ.. నేడు ఢిల్లీకి బానిసగా మారింది. తెలంగాణ సంపదను మూటలు కట్టి ఢిల్లీకి పంపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి చిన్న పనికి, మంత్రివర్గ విస్తరణకు, నామినేటెడ్ పదవులకు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ వీధుల్లో పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి తీరని అవమానం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేమని చేతులెత్తేసిన చేతగాని ప్రభుత్వం ఇది.

అబద్ధపు హామీలు - నిరుద్యోగుల ఆక్రందన!

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్వయంగా ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీని అశోక్ నగర్ రప్పించి నిరుద్యోగుల ఓట్లు దండుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా, ఉన్న ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీస్తున్నారు. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు జాబ్స్ ఇచ్చి వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం విడ్డూరం. కొత్త గ్రూప్స్ నోటిఫికేషన్లు లేవు, మెగా డీఎస్సీ ఊసే లేదు. నిరుద్యోగ భృతి రూ.4,000 ఇస్తామన్న హామీ ఎటు పోయిందో రేవంత్ రెడ్డికే తెలియాలి.

గురుకులాల్లో మరణ మృదంగం..

స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో తెలంగాణ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతుందని అంతా భావించారు. ఇంటిగ్రెడెట్ స్కూల్స్ పేరుతో ఉదర గొడుతూ.. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గురుకులాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రెండేళ్లలో గురుకులాల్లో వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ మరియు ఇతర కారణాలతో మరణించడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. పేద విద్యార్థుల చదువులకు ఆసరాగా నిలిచే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నిలిపివేసి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారు.

కాంగ్రెస్ మార్కు పాలన అంటే అబద్ధాలు, అరాచకాలు, మరియు అరాచకత్వం అని ప్రజలకు అర్థమైపోయింది. ఆరు గ్యారెంటీలు అడ్రస్ లేవు కానీ, ప్రకటనల కోసం మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాగే మొండిగా ముందుకు వెళ్తే, తెలంగాణ ప్రజలు త్వరలోనే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Social Media: చాటింగ్ పేరుతో చీటింగ్.. వీడియో కాలింగ్‌తో లూటింగ్
🏠 Home