🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 April 2026, 6:08 pm Posted by : STAR TRINETHRAM

China: కొత్త ట్రెండ్.. బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే డబ్బులు కట్టి మరీ జైలుకు వెళ్లాల్సిందేనట!

News Image
China: బరువు తగ్గడం కోసం జిమ్‌లు, డైట్ ప్లాన్లు, యోగా కేంద్రాలు విన్నవే కానీ జైలుకెళ్లి బరువు తగ్గడం అనేది చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించే విషయం. కానీ చైనాలో మాత్రం ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది. అక్కడ వందలాది మంది యువతీ యువకులు స్వచ్ఛందంగా ఫీజు చెల్లించి ప్రత్యేక ఫ్యాట్ జైళ్లలో చేరుతున్నారు. ఇవి సాధారణ జైళ్లు కాకుండా ఊబకాయం తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యేక శిక్షణ శిబిరాలు. అయితే వీటి నిర్మాణం, నిర్వహణ చూస్తే నిజమైన కారాగారాలను తలపిస్తాయి. ఎత్తైన గోడలు, భారీ గేట్లు, నిరంతర సీసీ కెమెరాల నిఘా, కఠిన నియమాలతో ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. ఒకసారి లోపల చేరితే నిర్ణయించిన గడువు ముగిసే వరకు బయటకు వచ్చే అవకాశం లేకపోవడం ఈ శిబిరాల ప్రత్యేకతగా చెబుతున్నారు.

ఈ ఫ్యాట్ జైళ్లలో 28 రోజుల పాటు కఠినమైన జీవనశైలి అమలు చేస్తారు. ఉదయం లేవగానే గంటల తరబడి శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఏరోబిక్స్, హై ఇంటెన్సిటీ వ్యాయామాలు, ప్రత్యేక ఫిట్‌నెస్ కార్యక్రమాలు ఇందులో భాగమవుతాయి. పాల్గొనే వారికి బయటి ఆహారంపై పూర్తిగా నిషేధం ఉంటుంది. శిబిరంలో ఇచ్చే నియంత్రిత ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉడికించిన మాంసం, పచ్చి కూరగాయలు, తక్కువ కేలరీల భోజనం మాత్రమే అందిస్తారు. ప్రతిరోజూ బరువును తనిఖీ చేస్తూ పురోగతిని గమనిస్తారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘించినా లేదా బద్ధకానికి లోనైనా హెచ్చరికలు తప్పవని నిర్వాహకులు చెబుతున్నారు. క్రమశిక్షణతో బరువు తగ్గించడమే ఈ శిబిరాల ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.

ఈ శిబిరాల్లో చేరేందుకు భారీ ఖర్చు కూడా అవుతోంది. ప్రముఖ ఇన్‌స్టాగ్రామర్ టి.ఎల్.హువాంగ్ 28 రోజుల కార్యక్రమం కోసం దాదాపు రూ.89,000 ఖర్చు చేసినట్లు వెల్లడించడం ఈ క్యాంపులపై మరింత చర్చకు దారితీసింది. ఈ సమయంలో బయటి ప్రపంచానికి దూరంగా పూర్తిగా ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. క్రమశిక్షణ లేని జీవనశైలి ఉన్నవారికి ఇది మంచి పరిష్కారమని కొందరు భావిస్తుండగా, మరికొందరు దీనిని మానసిక ఒత్తిడి పెంచే విధానంగా విమర్శిస్తున్నారు. స్వేచ్ఛను పరిమితం చేసి బరువు తగ్గించడం ఎంతవరకు సమంజసం అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇక ఈ ఫ్యాట్ జైళ్లపై విమర్శలు కూడా తక్కువగా లేవు. చైనాలో పెరుగుతున్న ఊబకాయం సమస్యను వ్యాపారంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ సమయంలో వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవక్రియ లోపాలు, శారీరక బలహీనత, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ స్లిమ్‌గా మారాలనే లక్ష్యంతో స్వచ్ఛందంగా ఈ ఫ్యాట్ జైళ్లను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతుండటం విశేషం. స్వేచ్ఛను వదిలి ఫిట్‌నెస్ కోసం జైలులో చేరడం ఇప్పుడు చైనాలో చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: SSC Recruitment: 84 పోస్టులతో భారీ నోటిఫికేషన్
🏠 Home