🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 April 2026, 7:15 am Posted by : STAR TRINETHRAM

Shocking Murder: ‘నల్లగా ఉన్నావు, నాకు సరిపోవు’ అంటూ భర్తపై కిరాతకానికి పాల్పడ్డ భార్య

News Image
Shocking Murder: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేయించిన విషయం వెలుగులోకి రావడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. వివాహ బంధం పవిత్రతపై ప్రశ్నలు తలెత్తేలా చేసిన ఈ సంఘటనలో బయటపడిన నిజాలు మరింత కలవరపెడుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. దేవకృష్ణ (28) అనే యువకుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏప్రిల్ 7 రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఘటన తర్వాత అతని భార్య ప్రియాంక పురోహిత్ (25) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దొంగలు ఇంట్లోకి చొరబడి తనను కట్టేసి, రూ.3.5 లక్షల విలువైన నగలు దోచుకెళ్లారని, అడ్డుకోవడానికి ప్రయత్నించిన తన భర్తను హతమార్చారని చెప్పింది. మొదట ఈ కేసు దోపిడీ కోణంలోనే కనిపించినప్పటికీ, పోలీసుల దర్యాప్తులో అనుమానాస్పద విషయాలు బయటపడడం ప్రారంభమైంది.

పోలీసులు ప్రియాంక చెప్పిన వివరాలను సవివరంగా పరిశీలించగా, ఆమె మాటల్లో అసమానతలు గమనించారు. తదుపరి విచారణలో భాగంగా ఆమె కాల్ వివరాలను పరిశీలించగా కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో ఆమెకు ఉన్న సన్నిహిత సంబంధం బయటపడింది. ఈ విషయంపై కఠినంగా ప్రశ్నించడంతో ప్రియాంక అసలు విషయాన్ని ఒప్పుకుంది. భర్త దేవకృష్ణ తనకు నచ్చడం లేదని, అతని రూపాన్ని కారణంగా చూపుతూ తరచూ అవమానించేదని వెల్లడించింది. తన ప్రియుడు కమలేష్‌తో కలిసి జీవించాలనే ఉద్దేశంతో భర్తను అడ్డంకిగా భావించి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపింది.

ఈ హత్యకు పూర్తి ప్రణాళిక కూడా ప్రియాంకదేనని పోలీసులు గుర్తించారు. కమలేష్ సహాయంతో సురేంద్ర భాటి అనే వ్యక్తికి రూ.1 లక్ష సుపారీ ఇచ్చి భర్తను హతమార్చాలని కుట్ర పన్నారు. అందులో రూ.50 వేలు ముందుగానే చెల్లించినట్లు విచారణలో వెల్లడైంది. హత్య జరిగిన రాత్రి కావాలనే ఇంటి తలుపులు తెరిచి ఉంచి, సురేంద్రను లోపలికి అనుమతించింది. అనంతరం అతడు పదునైన ఆయుధంతో దేవకృష్ణపై దాడి చేసి హత్య చేసి పరారయ్యాడు. తర్వాత దోపిడీ జరిగినట్లు నమ్మించేందుకు ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసి, నగలను దాచిపెట్టి, తనను తాను కట్టేసుకుని నాటకం ఆడినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. ప్రియాంక పురోహిత్ ఇచ్చిన వాంగ్మూలంలో తేడాలు కనిపించడంతో విచారణను మరింత ముమ్మరం చేశారు. కాల్ వివరాల ఆధారంగా అసలు కుట్ర బయటపడింది. ఈ మేరకు ప్రియాంకతో పాటు ఆమె ప్రియుడు కమలేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు పాల్పడిన సురేంద్ర భాటి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు తన కుమారుడిని కోల్పోయిన తల్లి నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ విలపిస్తోంది.

ALSO READ: OTT: దెయ్యాల సినిమాలో తోపు మూవీస్ మావ.. ఒంటరిగా చూస్తే సుస్సు పడుద్ది జాగ్రత్త!
🏠 Home