🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 April 2026, 4:06 pm Posted by : STAR TRINETHRAM

War Effect: సామాన్యుడిపై ధరల పిడుగు

News Image
War Effect: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధి, అలాగే ఎర్ర సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలు ఆలస్యమవుతుండటం వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రభావం భారత్ సహా అనేక దేశాలపై స్పష్టంగా కనిపిస్తోంది. దిగుమతులపై ఆధారపడే దేశంగా భారతదేశం భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. చమురు ధరలు పెరగడం వల్ల పెట్రోకెమికల్స్ ఆధారిత అన్ని పరిశ్రమలపై ప్రభావం పడుతోంది. ప్లాస్టిక్, సింథటిక్, మెడికల్, ప్యాకేజింగ్, గ్లాస్ పరిశ్రమలు ఖర్చులు పెరగడంతో ఉత్పత్తుల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ యుద్ధ పరిస్థితులపై డొనాల్డ్ ట్రంప్ తరచూ విభిన్న వ్యాఖ్యలు చేస్తుండటం గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితిని మరింత పెంచుతోంది. ఒకసారి యుద్ధం ముగుస్తుందని చెప్పడం, మరోసారి దాడులు పెంచుతామని హెచ్చరించడం వంటి ప్రకటనలు పెట్టుబడిదారులను అయోమయంలోకి నెట్టుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉండడంతో రూపాయి విలువ పడిపోతూ, దిగుమతి బిల్లు మరింత పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ప్రభావం నేరుగా సామాన్యులపై పడుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ధరలను పెంచాయి. ఉదాహరణకు హైదరాబాద్లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఫిబ్రవరిలో రూ.1,961 ఉండగా, యుద్ధ ప్రభావంతో రూ.214 పెరిగింది. దీంతో బయట భోజనం చేయడం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. కూరగాయలు, పాలు, వంటనూనె వంటి నిత్యావసరాల ధరలు కూడా పరోక్షంగా పెరిగాయి. బల్క్ డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి, అన్ని వస్తువుల ధరలపై ప్రభావం చూపుతోంది.

ముడి చమురు బైప్రొడక్ట్స్‌పై ఆధారపడే ప్లాస్టిక్ రంగంలో ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. పాలీథిలిన్, పాలీప్రొపీలిన్ వంటి పదార్థాలు ఖరీదవడంతో ప్యాకేజింగ్ వస్తువులు, పైపులు, కవర్లు అన్నీ ఖరీదయ్యాయి. అలాగే పీవీసీ ఆధారిత నిర్మాణ సామగ్రి ధరలు కూడా పెరిగాయి. సింథటిక్ ఫైబర్స్ అయిన నైలాన్, పాలిస్టర్, అక్రిలిక్ ధరలు పెరగడంతో వస్త్ర పరిశ్రమపై కూడా ఒత్తిడి పెరిగింది.

వ్యవసాయ రంగంలో కూడా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యూరియా తయారీలో ఉపయోగించే సహజ వాయువు ధరలు పెరగడంతో ఎరువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. భారత్ తన అవసరాలలో సుమారు 25 నుంచి 30 శాతం వరకు దిగుమతులపై ఆధారపడుతుంది. ముఖ్యంగా రష్యా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఎరువులు దిగుమతి అవుతాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ముందు నిల్వలు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రైతులపై భారం పడకుండా కేంద్రం సబ్సిడీలు పెంచుతున్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు మారకపోతే ధరలు నియంత్రించడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.

విమానయాన రంగంలో కూడా పరిస్థితి తీవ్రంగా మారింది. జెట్ ఫ్యూయెల్ ధరలు కిలోలీటర్‌కు రూ.2 లక్షలు దాటడంతో విమాన టికెట్ల ధరలు పెరుగుతున్నాయి. ఇంధనం మొత్తం నిర్వహణ ఖర్చులో సుమారు 40 శాతం ఉండటంతో ఎయిర్‌లైన్స్‌పై భారీ భారం పడుతోంది. ఇదే సమయంలో మేకప్ ఉత్పత్తులు, డిటర్జెంట్లు, సోపులు వంటి రోజువారీ వాడుక వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. వీటి తయారీలో ఉపయోగించే రసాయనాలు పెట్రోలియం ఆధారితమైనవే కావడం వల్ల ఈ ప్రభావం తప్పడం లేదు.

అటు ఎగుమతులపైనా యుద్ధం ప్రభావం పడుతోంది. కోనసీమలో కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎగుమతులు ఆగిపోవడంతో వెయ్యి కొబ్బరికాయల ధర రూ.25,000 నుంచి రూ.15,000కు పడిపోయింది. నిల్వ సదుపాయాలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మెడికల్ రంగంలో సిరంజిలు, ఐవీ బ్యాగులు, ఇతర పరికరాల తయారీ ఖర్చులు పెరగడంతో ఆసుపత్రి బిల్లులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

గ్లాస్ పరిశ్రమపై కూడా భారీ ప్రభావం పడింది. ఇంధన ధరలు పెరగడంతో గాజు సీసాల తయారీ ఖర్చు 15 నుంచి 25 శాతం వరకు పెరిగింది. ముడి సరుకు దిగుమతులు ఆలస్యమవుతుండటంతో ఉత్పత్తి తగ్గిపోయింది. ప్యాకేజింగ్ రంగంలో కూడా లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగి కంపెనీలు ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలు పరిశ్రమల సంస్థలు ప్రభుత్వాలకు ధరల సవరణ కోసం లేఖలు రాస్తున్నాయి.

మొత్తంగా ఒకే యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. చమురు ధరలు పెరగడం వల్ల నేరుగా లేదా పరోక్షంగా ప్రతి వస్తువు ధర పెరిగే పరిస్థితి ఏర్పడింది. యుద్ధం త్వరగా ముగియకపోతే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ధరలను నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు మారకపోతే సామాన్యుడిపై భారం ఇంకా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ALSO READ: Weather Alert: ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు
🏠 Home