🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 March 2026, 5:47 pm Posted by : STAR TRINETHRAM

Sun Preet Singh: సంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

News Image
Sun Preet Singh: వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం సంగెం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు స్థానిక పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, ఆవరణలో మామిడి మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణపై తన సందేశాన్ని ఇచ్చారు. స్టేషన్ శుభ్రత, నిర్వహణ, సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆయన, పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, క్రమశిక్షణ ఎంత ముఖ్యమో సిబ్బందికి వివరించారు.



తదుపరి స్టేషన్ పనితీరును సమగ్రంగా పరిశీలించిన కమిషనర్.. స్టేషన్ పరిధిలోని గ్రామాల పరిస్థితులు, ప్రజల జీవన విధానం, ప్రాంతంలో నమోదవుతున్న నేరాల స్వభావం, రౌడీ షీటర్లు, అనుమానితుల కదలికలపై ఎస్సైని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే బీట్ వ్యవస్థ అమలు, రాత్రి పహారా విధులు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ వ్యవస్థ సమర్థంగా పనిచేయాలంటే ప్రతి విభాగం సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.



స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, నిందితుల అరెస్టుకు సంబంధించిన పురోగతిని కూడా కమిషనర్ పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగేలా పోలీసులు పని చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడం, విధి నిర్వహణలో అలసత్వం లేకుండా పారదర్శకంగా సేవలు అందించడం అత్యవసరమని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని పొందడం పోలీస్ వ్యవస్థకు అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.



ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సిఐ రాజగోపాల్, సంగెం ఎస్సై వంశీ కృష్ణతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ: Home Tips: మీ స్మార్ట్ టీవీ వేడెక్కుతోందా?.. కాలిపోకుండా ఉండాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి!
🏠 Home