🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 22 March 2026, 9:01 am Posted by : STAR TRINETHRAM

Trump: ఈసారి దెబ్బ గట్టిగా ఉంటుంది.. ఇరాన్‌కు వార్నింగ్!

News Image
Trump: గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ఇప్పటికే 22 రోజులు పూర్తయ్యాయి. ఈ ఘర్షణ ఇప్పుడు నాలుగో వారంలోకి ప్రవేశించినప్పటికీ, ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రభావం కేవలం ఆ దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన దెబ్బ కొడుతోంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ సరఫరా లోపం కారణంగా అనేక దేశాలు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. చిన్న దేశాలు ఆర్థికంగా కుదేలవుతుండగా, అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికా కూడా పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అక్కడ ప్రజలు పెరిగిన ఇంధన ధరలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు నాయకత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేస్తున్నాయి.

ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. 48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే, ఇరాన్‌లోని అనేక విద్యుత్ కేంద్రాలపై భారీ దాడులు చేపడతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా అతిపెద్ద విద్యుత్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి ప్రారంభిస్తామని అమెరికా ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో చేసిన వ్యాఖ్యల్లో, ఇరాన్ దళాలు కీలక సముద్ర మార్గాన్ని దిగ్బంధించడాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఎటువంటి ఆలస్యం లేకుండా 48 గంటలలోపే ఆ మార్గాన్ని తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. తాము నిర్ణయించిన లక్ష్యాలను అనుకున్న సమయానికి ముందుగానే సాధించామని కూడా ట్రంప్ పేర్కొనడం గమనార్హం.

హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గంగా గుర్తింపు పొందింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుండటంతో, అక్కడ ఏర్పడిన ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ నౌకాయానానికి ముప్పుగా మారుతున్న నేపథ్యంలో చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సమయంలో కొనసాగుతున్న ఘర్షణ మధ్య అమెరికా వెనక్కి తగ్గే అవకాశాలపై కూడా ఆయన సంకేతాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

అదే సమయంలో ట్రంప్ మీడియాపై కూడా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా డేవిడ్ సాంగర్‌పై స్పందిస్తూ, అమెరికా లక్ష్యాలను సాధించలేదని ప్రచారం చేయడం తప్పు అని పేర్కొన్నారు. తమ దేశం యుద్ధంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిగా నెరవేర్చిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వ వ్యవస్థ కుదేలైందని, ఆ దేశ నౌకాదళం, వైమానిక దళం పనికిరాకుండా చేశామని, భద్రతా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ చర్చలకు సిద్ధమవుతోందని చెప్పినా, తాను మాత్రం ఎలాంటి ఒప్పందానికి సిద్ధంగా లేనని ట్రంప్ స్పష్టం చేయడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఈ పరిణామాల మధ్య గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Fuel Crisis: యుద్ధం అక్కడ.. వాత ఇక్కడ!
🏠 Home