🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 March 2026, 7:54 pm Posted by : STAR TRINETHRAM

RevanthReddy: తెలంగాణ మావోయిస్టు స్టేట్ కమిటీ ముగింపు

News Image
సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు

మిగిలిన వారూ లొంగిపోవాలని డీజీపీ పిలుపు

స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ ఇక లేదని, ఆ కమిటీకి సంబంధించిన మిగిలిన సభ్యులందరూ లొంగిపోయారని ఆయన వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తం 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలను అప్పగించి లొంగిపోయారు.

లొంగిపోయిన వారిలో తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన ఐదుగురు సభ్యులు కూడా ఉండటంతో ఇక రాష్ట్ర కమిటీ చరిత్రలోనే మిగిలిపోయిందని డీజీపీ పేర్కొన్నారు. తుపాకీ ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్ముతూ తెలంగాణ నాయకత్వంలో పోరాటం కొనసాగించిన మావోయిస్టు పార్టీకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ లేకుండా పోయిందని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు కమిటీలలో తెలంగాణకు చెందిన సభ్యులు కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారని, వారు కూడా త్వరలోనే లొంగిపోవాలని పిలుపునిచ్చారు.

శనివారం లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. వారు ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆయుధాలను సమర్పించారు. అందులో ఒక ఇన్‌సాస్ ఎల్‌ఎంజీ రైఫిల్, 31 ఏకే-47 రైఫిళ్లు, 21 ఇన్‌సాస్ రైఫిళ్లు, 20 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 18 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులు ఉన్నాయి.

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోయిస్టుల హోదాలను బట్టి ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తామని తెలిపారు. వారికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే రాష్ట్రంలో భూమి లభ్యత కష్టంగా ఉన్నందున భూమి ఇవ్వడంపై హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హింసకు తావు లేదని, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే ప్రభుత్వం సహించదని సీఎం హెచ్చరించారు. మావోయిస్టులు ప్రజాప్రవాహంలోకి వచ్చి సాధారణ జీవితం గడపాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు.

ALSO READ: RevanthReddy: లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం కీలక హామీ
🏠 Home