🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 March 2026, 7:26 pm Posted by : STAR TRINETHRAM

DISHA Meeting: అభివృద్ధి పనులపై ఎంపీ కడియం కావ్య సమీక్ష

News Image
ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులకు ఆదేశాలు

విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు

పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని పిలుపు

వేసవిలో తాగునీటి సమస్యలు నివారించేందుకు చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు సూచనలు

వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక సమీక్ష

స్టార్ త్రినేత్రం, హనుమకొండ: ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం కడియం కావ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కూడా సమీక్ష నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమం, జిల్లా వైద్య ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్యం, నీటిపారుదల, గనులు, భూగర్భ జలాలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సంస్థ, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, జిల్లా ప్రణాళిక తదితర విభాగాల పనితీరుపై ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కడియం కావ్య.. ప్రభుత్వం విద్యా మరియు వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. చదువును మధ్యలోనే మానేసే విద్యార్థుల సమస్యపై దృష్టి సారించి వారిని తిరిగి పాఠశాలలకు తీసుకురావాలని అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలికల కోసం వసతి గృహాలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చూడవచ్చని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కడియం కావ్య సూచించారు. పాఠశాలల్లో బాలికలకు అవసరమైన మరుగుదొడ్లు ఉండాలని, దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణలో వైద్య ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల మార్గదర్శకాలను అధికారులకు వివరించి వాటి అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారులపై అనేక చోట్ల వీధి దీపాలు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాలతో పోలిస్తే ప్రగతి తక్కువగా ఉందని పేర్కొన్నారు. చిన్నారుల కోసం ముందస్తు విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం సమస్యగా ఉందని పేర్కొంటూ వేసవి సెలవులు ముగిసేలోపు అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పిల్లలకు ఇచ్చే టీకాల శాతం తక్కువగా ఉందని, దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వంద శాతం టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో నిర్మాణం పూర్తయినా ఇంకా ప్రారంభం కాని 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు.

శాసనమండలి సభ్యుడు బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ.. వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాలో 400కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక బాధ్యతాయుత అధికారిని నియమించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పాఠశాలల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చెత్త నిల్వ ప్రదేశాల సమస్యలు మరియు తాగునీటి సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రహదారి ప్రమాదాల కారణంగా యువత మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ వాటి నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.

భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సామాజిక సంక్షేమ పాఠశాలల్లో అదనపు గదులు, వంటశాలలు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో చర్చించిన అంశాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని చెప్పారు. నగరంలో నీటి లీకేజీలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫిల్టర్ బెడ్ల మరమ్మతులను ఈ నెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

సమావేశం అనంతరం బాలికల ఆరోగ్య రక్షణ కోసం నిర్వహించనున్న టీకా కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లు, సౌర విద్యుత్ పథకానికి సంబంధించిన అవగాహన పోస్టర్లను ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

ALSO READ: Wardhannapet: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ధ్యేయం
🏠 Home