🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 March 2026, 3:27 pm Posted by : STAR TRINETHRAM

Pakistan: భారత్ యుద్దానికి రెడీ అవుతోంది: పాకిస్థాన్

News Image
Pakistan: ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం రోజురోజుకూ తీవ్రమవుతూ భీకర సమరానికి దారి తీస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం భయం అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా మారిన వేళ దక్షిణాసియాలోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ భారత్‌పై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆయన ఆరోపించడం రాజకీయంగా, దౌత్యపరంగా కొత్త వాదనలకు తెరలేపింది.

ఆసిఫ్‌ అలీ జర్దారీ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సింధూ జలాల ఒప్పందం అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ నీటిని ఆయుధంలా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ప్రాంతీయ శాంతిని భంగం చేసే చర్యలను తాను సమర్థించబోనని స్పష్టం చేశారు. నీటి వనరుల విషయంలో ఒత్తిడి తేవడం సముచితం కాదని, ఇది రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు.

యుద్ధ ఆలోచనలను పక్కనబెట్టి చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన భారత అధికారులకు సూచించారు. దక్షిణాసియాలో స్థిరత్వం కోసం శాంతి చర్చలే ఏకైక పరిష్కారమని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అక్కడి ప్రజలకు అవసరమైన దౌత్య సహకారం అందించేందుకు ముందుంటామని తెలిపారు. ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కానంతవరకు ప్రాంతీయ శాంతి స్థిరపడదని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు అఫ్గానిస్తాన్‌పై కూడా పాకిస్థాన్ అధ్యక్షుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ దేశంలో శాంతిని అస్థిరపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకునేందుకు భద్రతా దళాలు కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించారు. ప్రపంచంలోని ఉగ్రవాద శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ అఫ్గానిస్తాన్ తాలిబన్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భద్రతను కాపాడేందుకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, దక్షిణాసియా రాజకీయ పరిణామాలు, నీటి ఒప్పందాల వివాదాలు అన్నీ కలసి ప్రస్తుత పరిస్థితిని మరింత సున్నితంగా మార్చాయి. అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరమైన చర్చలు వేగవంతమవుతున్న ఈ సమయంలో పాకిస్థాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: Holi Skincare: హోలీ తర్వాత చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
🏠 Home