🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 March 2026, 3:13 pm Posted by : STAR TRINETHRAM

Magic Rice: నీళ్లు పోస్తే చాలు.. వండకుండానే అన్నం రెడీ

News Image
Magic Rice: వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలతో ముందుకు సాగుతున్న రైతులు సమాజానికి కొత్త దారులు చూపిస్తున్నారు. అలాంటి అరుదైన ప్రయోగాల్లో ఒకటిగా నిలుస్తోంది “మ్యాజిక్ రైస్” పేరుతో ప్రాచుర్యం పొందిన ప్రత్యేక వరి రకం. వంట చేయాల్సిన అవసరం లేకుండా కేవలం నీళ్లలో నానబెట్టడం ద్వారా అరగంటలోనే అన్నం సిద్ధమవుతుందనే విశేషం దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. కరీంనగర్ జిల్లాలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ ప్రత్యేక వరిని సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇంధనం అవసరం లేకుండా, పొయ్యి వెలిగించకుండా, కేవలం నీటితోనే అన్నం సిద్ధమవుతుందనే అంశం గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీకాంత్ ప్రారంభంలో సాధారణ రసాయన ఎరువులతో సాగు చేసినప్పటికీ, తరువాత ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాడు. ప్రకృతి ఆధారిత పద్ధతులు, నేల ఆరోగ్యం, మనిషి ఆరోగ్యం పరస్పర సంబంధం ఉన్నాయని గుర్తించిన ఆయన సంపూర్ణ సేంద్రీయ విధానాన్ని ఎంచుకున్నాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ దాదాపు 9 రాష్ట్రాల్లో తిరిగి 120 రకాల దేశీయ వరి వంగడాలను సేకరించాడు. అంతరించిపోతున్న పాత వంగడాలను కాపాడాలనే లక్ష్యంతో ఆయన సాగు పద్ధతులను మార్చుకున్నాడు. పెట్టుబడి భారాలు, నీటి కొరత, మార్కెట్ సమస్యలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు అన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు.

అస్సాం ప్రాంతం నుంచి తీసుకొచ్చిన “బోకాసాల్” అనే వరి రకం గతంలోనే విశేష చర్చకు దారితీసింది. జూన్ నుంచి డిసెంబర్ వరకు సాగు చేసే ఈ పంట సుమారు 145 రోజుల్లో కోతకు వస్తుంది. ఈ బియ్యాన్ని చల్లటి నీటిలో నానబెడితే చల్లటి అన్నం, వేడి నీటిలో నానబెడితే వేడి అన్నం సిద్ధమవుతుందనే ప్రత్యేకత ఉంది. సరిపడా నీటిని పోసి 30 నుంచి 40 నిమిషాలు నానబెడితే అన్నం తయారవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో, అడవి ప్రాంతాల్లో, సైనిక అవసరాల్లో కూడా ఇది ఎంతో ఉపయోగకరమని చెబుతున్నారు. కూరలు లేకుండానే తినగలిగే లక్షణం కూడా ఈ బియ్యానికి ఉంది.

ఈ ప్రత్యేక వరి పోషక విలువలపై ప్రముఖ పరిశోధనా సంస్థలు అధ్యయనాలు నిర్వహించాయి. గౌహతి యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వంటి పరిశోధనా సంస్థలు పరిశోధనల్లో ఈ బియ్యంలో 10.73 శాతం పీచు, 6.8 శాతం ప్రోటీన్లు ఉన్నట్టు వెల్లడైంది. అధిక పీచు శాతం కారణంగా ఇది నెమ్మదిగా జీర్ణమై శరీరానికి ఎక్కువసేపు శక్తిని అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా కూడా ఈ బియ్యం వినియోగం ప్రయోజనకరమని భావిస్తున్నారు.

అస్సాంలోని గిరిజనులు, సైనిక దళాలు ఈ బియ్యాన్ని ఎక్కువగా వినియోగిస్తుండటం దీని ప్రయోజనాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఆధునిక వ్యవసాయంలో మరిచిపోయిన దేశీ వంగడాలను తిరిగి వెలుగులోకి తీసుకువస్తూ శ్రీకాంత్ చేస్తున్న కృషి ఇతర రైతులకు ప్రేరణగా నిలుస్తోంది. ఇంధన వ్యయం తగ్గించడంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారం అందించగల ఈ “మ్యాజిక్ రైస్” భవిష్యత్తులో విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ALSO READ: Road Name: ‘ఖమేనీ’ పేరుతో రోడ్డు ఉందట?.. ఎక్కడో కాదు, మన హైదరాబాద్‌లోనే!
🏠 Home