🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 02 March 2026, 5:31 pm Posted by : STAR TRINETHRAM

Vegetable Chutney: రోజు తిన్న కూరలే తిని బోర్ కొట్టిందా?.. ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేయండి

News Image
Vegetable Chutney: ఇంట్లో ప్రతిరోజూ ఒకే రకమైన కూరలు తింటూ ఉంటే సహజంగానే బోర్ అనిపిస్తుంది. అలాంటి సమయంలో పచ్చి కూరగాయలతో తయారుచేసే ప్రత్యేక రోటి పచ్చడి మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. సాదాసీదా పదార్థాలతో, ఎక్కువ శ్రమ లేకుండా తయారయ్యే ఈ వంటకం రుచిలో మాత్రం అసలు రాజీ పడదు. మసాలా రుచిని ఇష్టపడేవారు మంట మిర్చిని కొద్దిగా ఎక్కువగా వేసుకుని మరింత కారం రుచిని ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సంప్రదాయ రీతిలో రోటి మీద దంచిన పచ్చడి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఈ రుచికరమైన పచ్చి కూరగాయల రోటి పచ్చడిని ఎలా తయారుచేయాలో వివరంగా తెలుసుకుందాం.

ఈ వంటకానికి 4 వంకాయలు, 4 టమాటోలు, 1 కప్పు బీరకాయ ముక్కలు, 1 కప్పు దొండకాయ ముక్కలు, 1 కప్పు బెండకాయ ముక్కలు, 250 గ్రాముల పచ్చిమిర్చి, 1 చిన్న ఉల్లిపాయ, తగినంత చింతపండు రసం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు నూనె సిద్ధం చేసుకోవాలి. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి బాగా వేడయ్యాక అందులో వంకాయ, బీరకాయ, దొండకాయ, బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వెంటనే టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు రసం కూడా వేసి మోస్తరు మంటపై సుమారు 10 నిమిషాలు బాగా మగ్గించాలి. కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి.

మగ్గిన ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఆ తరువాత రోటిపై వేసి సంప్రదాయ రీతిలో దంచుకోవాలి. కూరగాయలు కొద్దిగా ముద్దలా అయ్యేంత వరకు దంచుతూ మధ్య మధ్యలో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మరింత మెత్తగా చేసుకోవాలి. ఈ దంచే ప్రక్రియలోనే అసలు రుచి దాగి ఉంటుంది. చేతితో దంచడం వల్ల కూరగాయల సహజ సువాసన మరింతగా బయటపడుతుంది.

ఇప్పుడు తాలింపు కోసం మరోసారి పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తరువాత పోపు గింజలు, అర టీ స్పూన్ ఆవాలు, మినుములు, 4 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు ఆకులు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఈ తాలింపును దంచిన పచ్చడిపై వేసి బాగా కలిపితే వంటకం సిద్ధం అవుతుంది.

ఇలా తయారైన వేడి వేడి పచ్చి కూరగాయల రోటి పచ్చడి తెలుగురాష్ట్రాల్లో ఎంతో మంది ఇష్టంగా తింటారు. వేడి అన్నంలో కొద్దిగా ఈ పచ్చడి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. సాదాసీదా పదార్థాలతో చేసినప్పటికీ ఈ పచ్చడి ఇంటి వంటకు కొత్త రుచిని తీసుకొస్తుంది.

ALSO READ: Neha Shetty: ఈ అందాల భామను జర పట్టించుకోండయ్యా!.. డీజే టిల్లు హీరోయిన్‌కి కరువైన ఆఫర్లు
🏠 Home