🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 February 2026, 1:25 pm Posted by : STAR TRINETHRAM

Arjun Tendulkar Wedding: నా కొడుకు ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడు.. ఎమోష‌న‌ల్ అయిన సచిన్ టెండూల్కర్

News Image
Arjun Tendulkar Wedding: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహంపై చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. తన కొడుకు ఇప్పుడు పూర్తిగా ఎదిగిన యువకుడని, తన మనసుకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకున్నాడని పేర్కొంటూ ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. తండ్రిగా తన బాధ్యతల్లో ఒకటి అతని నిర్ణయాలను గౌరవించడం అని చెప్పిన ఆయన.. నా కొడుకు ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన నేపథ్యంలోనే ఈ వివాహానికి అంగీకరించినట్లు వెల్లడించారు.

అర్జున్ జీవితంలోకి వచ్చిన యువతి పేరు సానియా చందోక్. వీరి వివాహం మార్చి 5న నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇరు కుటుంబాలు సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తూ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంటి పెద్దల ఆశీస్సులతో, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుందని సమాచారం. పెళ్లి పనులతో ఇరు కుటుంబాలు ఉత్సాహంగా నిమగ్నమై ఉండగా, ఆహ్వానితుల జాబితా, వేడుకల నిర్వహణ, అతిథుల స్వాగత ఏర్పాట్లు అన్నీ వేగంగా కొనసాగుతున్నాయి.

ఇటీవల జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సచిన్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తన కుమారుడు ఒక యువతిని ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేసిన క్షణం తాను ఆశ్చర్యపోయానని, అదే సమయంలో అతను జీవితంలో తన నిర్ణయాలను స్వయంగా తీసుకునే స్థాయికి చేరుకున్నాడని భావించానని చెప్పారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం నిజమైన ప్రేమపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఒక తండ్రిగా తనకు గర్వంగా అనిపించిందని ఎమోషనల్ అయ్యారు.

అర్జున్, సానియా ఇద్దరూ పరస్పర అవగాహనతో, కుటుంబాల సమ్మతితో కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నారని తెలిపారు. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో కలిసి జీవించాలని ఆశీర్వదించారు. ఈ వివాహం కేవలం రెండు వ్యక్తుల కలయిక మాత్రమే కాకుండా రెండు కుటుంబాల అనుబంధానికి ప్రతీకగా నిలవబోతుందని పేర్కొన్నారు. సానియా ప్రముఖ వ్యాపారవేత్త ర‌వి ఘాయ్ మనవరాలు కావడం విశేషం. ఇరు కుటుంబాలు ఆనందోత్సాహాల మధ్య ఈ శుభకార్యానికి సిద్ధమవుతుండగా, అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ALSO READ: State Renaming: దేశంలో ఒక రాష్ట్రం పేరు మార్చడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
🏠 Home