🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 23 February 2026, 5:27 pm Posted by : STAR TRINETHRAM

Telangana: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు

News Image
Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో 4,89,126 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.

పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రైవేటు కళాశాలలతో పాటు 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా కేంద్రాలుగా ఎంపికయ్యాయి. పరీక్షలు పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు 28,500 మంది పర్యవేక్షకులను నియమించారు. అదనంగా 75 ఫ్లయింగ్ దళాలు, 200 సిట్టింగ్ దళాలను ఏర్పాటు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 1 గంట ముందే, అంటే ఉదయం 8 గంటలకు కేంద్రానికి చేరుకోవాలని స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లేదా సంబంధిత కళాశాలల ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్లను అనుమతించాలని విద్యా మండలి స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్షలకు హాజరుకావచ్చని అధికారులు పేర్కొన్నారు.

పరీక్షల సమయంలో కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయి. సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా హాల్లోకి అనుమతించరని స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పరీక్షల పర్యవేక్షణ కోసం సుమారు 7,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ప్రతి చర్యను ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ గదిలో నుంచి నేరుగా పరిశీలించనున్నారు. దీనివల్ల పారదర్శకత పెరిగి అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి కేంద్రంలో తాగునీరు, సరిపడ ఫర్నిచర్, గోడ గడియారాలు, వైద్య సహాయం వంటి సదుపాయాలు కల్పించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడి లేదా ఆందోళనకు గురైతే నిపుణుల సలహా పొందేందుకు 14416 అనే ఉచిత హెల్ప్‌లైన్‌ను అందుబాటులో ఉంచారు. ఈ సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి నిబంధనలు పాటిస్తే విజయాన్ని సాధించవచ్చని విద్యా మండలి సూచించింది.

ALSO READ: Telangana: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు
🏠 Home