🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 February 2026, 8:11 pm Posted by : STAR TRINETHRAM

High Court: శృంగారంలో పాల్గొన్న తర్వాత పెళ్లి చేసుకోవడం కుదరకపోతే అది నేరం కాదు

News Image
High Court: పరస్పర అంగీకారంతో సుదీర్ఘకాలం పాటు కలిసి జీవించిన ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం విఫలమైతే, ఆ తరువాత వివాహానికి పురుషుడు నిరాకరించిన కారణంగా దానిని అత్యాచారంగా పరిగణించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు స్పష్టంచేసింది. సంబంధం కొనసాగిన కాలవ్యవధి, పరస్పర సమ్మతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం వివాహం జరగలేదనే కారణంతో క్రిమినల్ కేసు నమోదు చేయడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. మొదటి నుంచే మోసం చేయాలనే ఉద్దేశంతో తప్పుడు హామీ ఇచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే అది నేరంగా పరిగణించవచ్చని వెల్లడించింది.

ముస్సోరీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తనను వివాహం చేసుకుంటానని నమ్మబలికి శారీరక సంబంధం పెట్టుకుని అనంతరం మాట తప్పాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. సూరజ్ బోరా అనే వ్యక్తి 45 రోజుల్లో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తర్వాత తిరస్కరించాడని ఆమె వాదించింది. ఈ ఆరోపణల ఆధారంగా నమోదు చేసిన కేసు విచారణకు వచ్చినప్పుడు న్యాయమూర్తి ఆశిష్ నైథానీ సమగ్రంగా పరిశీలించారు.

ఇద్దరూ పెద్దవారేనని, పరస్పర అంగీకారంతోనే సంబంధం కొనసాగినట్లు కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. సంబంధం ప్రారంభం నుంచే నిందితుడికి మోసం చేసే ఉద్దేశం ఉన్నట్లు నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీర్ఘకాలిక సహజీవనం పరస్పర సమ్మతిని సూచిస్తుందని, కేవలం సంబంధం విఫలమైందనే కారణంతో క్రిమినల్ చర్యలు కొనసాగించడం అనవసర వేధింపులకే దారి తీస్తుందని పేర్కొంది.

2023 జూలై 22న దాఖలైన అభియోగ పత్రాన్ని కూడా న్యాయస్థానం పూర్తిగా కొట్టేసింది. వివాహ హామీ తప్పనిసరిగా మోసపూరిత ఉద్దేశంతో ఇచ్చినదని నిరూపితమైతేనే అత్యాచారంగా పరిగణించవచ్చని ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో ఉన్న సంబంధాల విషయంలో విచక్షణతో వ్యవహరించాలని న్యాయస్థానం సూచించినట్లు న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ తీర్పు సహజీవనం, వివాహ హామీలు, క్రిమినల్ బాధ్యతల మధ్య ఉన్న సున్నితమైన సరిహద్దులను మరోసారి స్పష్టంచేసిందని నిపుణులు పేర్కొంటున్నారు. పెద్దల మధ్య పరస్పర సమ్మతితో ఏర్పడిన బంధం విఫలమైతే అది ప్రతి సందర్భంలోనూ నేరంగా పరిగణించలేమని ఈ తీర్పు దృష్టాంతంగా నిలుస్తోంది.

ALSO READ: ఇది పోలీస్ జాగీరు కాదు.. ఖబర్దార్: అరూరి రమేష్
🏠 Home