🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 February 2026, 8:40 pm Posted by : STAR TRINETHRAM

Telangana: రేపే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

News Image
* ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు

* కౌంటింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత

* సెక్షన్ 163 అమలు- నిషేధాజ్ఞలు జారీ

* పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమయ్యే లెక్కింపు

Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు (ఫిబ్రవరి 13, 2026) ఉదయం 8 గంటలకు నిర్ణీత కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం అవసరమైన సూపర్ వైజర్లు, అసిస్టెంట్లు, సిబ్బందిని ఇప్పటికే నియమించారు. శాంతిభద్రతల దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల పరిసరాల్లో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

కౌంటింగ్ హాల్‌లోకి కేవలం సూపర్ వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. వీరందరూ అధికారికంగా జారీ చేసిన పాసులు తప్పనిసరిగా కలిగి ఉండాలి. మొబైల్ ఫోన్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించరు. పారదర్శకత కోసం కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వెలుపల వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఇటీవల ముగిసిన ఈ ఎన్నికల్లో 73.01 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభం..

లెక్కింపు ప్రక్రియను ముందుగా పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభిస్తారు. అవి పూర్తయ్యాక సాధారణ బ్యాలెట్ బాక్సులను తెరుస్తారు. వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ టేబుళ్లకు తీసుకువచ్చి, ఒక్కో పోలింగ్ స్టేషన్ ఓట్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. 25 కంటే తక్కువగా మిగిలిన ఓట్లను విడిగా ఉంచి వాటిపై సంఖ్య నమోదు చేసిన స్లిప్ అంటిస్తారు.

ఆయా పోలింగ్ స్టేషన్ల వివరాలను నమోదు చేసిన అనంతరం, ఆ వార్డులోని అన్ని కట్టలను ఒక పెద్ద డ్రమ్ములో వేసి బాగా కలుపుతారు. దీనివల్ల ఏ పోలింగ్ స్టేషన్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న వివరాలు బయటపడకుండా గోప్యతను కాపాడతారు. అసంపూర్తిగా ఉన్న కట్టలను సాధ్యమైనంత వరకు పూర్తి కట్టలుగా మారుస్తారు. మిగిలిన చిల్లర ఓట్లను విడిగా ఉంచి లెక్క నమోదు చేస్తారు. ఇదే విధానాన్ని ప్రతి వార్డుకు అనుసరిస్తారు.

రౌండ్లవారీగా లెక్కింపు..

బ్యాలెట్లను సమగ్రంగా కలిపిన తర్వాత అసలు లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రతి రౌండ్‌లో డ్రమ్ము నుంచి యాదృచ్ఛికంగా 1000 ఓట్లు (40 కట్టలు) తీసి కౌంటింగ్ టేబుళ్లకు పంపిస్తారు. అక్కడ అభ్యర్థుల వారీగా, నోటా, సందేహాస్పద ఓట్ల కోసం వేర్వేరు విభాగాలున్న చెక్క ట్రేలను ఉపయోగిస్తారు.

ప్రతి ఓటును ఏజెంట్లకు చూపిస్తూ దాని చెల్లుబాటును నిర్ధారించి, సంబంధిత అభ్యర్థి ట్రేలో వేస్తారు. అభ్యర్థుల వారీగా వచ్చిన చెల్లుబాటయ్యే ఓట్లను 100 చొప్పున కట్టలుగా కడతారు. అలాగే నోటా, సందేహాస్పద ఓట్లను కూడా 100 చొప్పున బండిల్ చేస్తారు. వందకు తక్కువగా ఉన్న ఓట్లను విడిగా ఉంచి ఆ సంఖ్యను స్లిప్‌పై నమోదు చేస్తారు. సందేహాస్పద ఓట్లపై తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ) తీసుకుంటారు.

కట్టుదిట్టమైన పర్యవేక్షణ..

లెక్కింపు మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి దశలో అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. భద్రతా సిబ్బంది, వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ, నియంత్రిత ప్రవేశం వంటి చర్యలతో కౌంటింగ్ కేంద్రాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే అధికారిక ఫలితాలు ప్రకటించబడతాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.

ALSO READ: Maha Shivaratri: ఈ శివరాత్రి చాలా ప్రత్యేకం.. 300 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగాలతో వస్తుంది
🏠 Home