🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 February 2026, 10:15 pm Posted by : STAR TRINETHRAM

Dammu Srija: బిగ్ బాస్ కోసం రూ.2 లక్షల శాలరీ, కెరీర్‌ని వదిలేసుకొని వెళ్లా కానీ..

News Image
Dammu Srija: బిగ్‌బాస్ సీజన్-9లో కామనర్ కేటగిరీ నుంచి హౌస్‌లోకి అడుగుపెట్టి మొదటి రోజే తన దమ్ము చాటుకున్న కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న దమ్ము శ్రీజ మరోసారి వార్తల్లో నిలిచింది. అగ్నిపరీక్ష టాస్క్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె.. హౌస్‌లోనూ నేరుగా మాట్లాడే స్వభావంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే అనూహ్యంగా తక్కువ వారాల్లోనే ఆమె ఎలిమినేట్ కావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా కాకుండా ఎలిమినేషన్ జరిగిందనే అనుమానాలతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు స్టార్ మా ప్రసారం చేస్తున్న బీబీ జోడీ షోలో పాల్గొంటున్న శ్రీజ, జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ కార్యక్రమంలో గెస్ట్‌గా పాల్గొని తన వ్యక్తిగత జీవితం, బిగ్‌బాస్ అనుభవాలు, కెరీర్, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టంగా స్పందించింది.

తన పేరుకు ముందు ‘దమ్ము’ అన్న పదాన్ని తానే జోడించుకున్నానని చాలా మంది అనుకుంటారని, కానీ అది తమ ఇంటిపేరేనని శ్రీజ వెల్లడించింది. తాను వైజాగ్‌కు చెందినవారినని, తన కుటుంబం సాధారణ మధ్యతరగతి నేపథ్యం కలిగినదని చెప్పింది. తన తండ్రి జీవీఎమ్‌సీలో ఉద్యోగం చేస్తున్నారని తెలిపింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో తన ఇల్లు తుడుస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అవమానకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ ట్రోలింగ్ తమ కుటుంబాన్ని మానసికంగా బాధించిందని చెప్పింది. తన తండ్రి చేసే పనిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం హర్టింగ్‌గా అనిపించిందని పేర్కొంది.

బిగ్‌బాస్ ద్వారా ఎంత సంపాదించావన్న ప్రశ్నకు సమాధానంగా, కామనర్ కేటగిరీ నుంచి వెళ్లినందున భారీ పారితోషికం ఏమీ లేదని, కానీ ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సినంత ఇచ్చారని తెలిపింది. దివ్వెల మాధురితో జరిగిన వివాదంపై కూడా స్పందిస్తూ, తాను రాజకీయాలను పెద్దగా ఫాలో అవ్వనని, అందుకే వ్యక్తిగతంగా పరిచయం లేకపోవడం సహజమని చెప్పింది. ఎవరు ఎంత పెద్దవారైనా పేరు అడిగితే చెప్పడంలో తప్పేమీ లేదని సెటైరిక్‌గా వ్యాఖ్యానించింది.

బిగ్‌బాస్ టైటిల్ కామనర్ గెలవాలని అనుకున్నానని, ముఖ్యంగా కళ్యాణ్ గెలవాలని కోరుకున్నానని శ్రీజ తెలిపింది. తనకు పీఆర్ వ్యవస్థపై పెద్దగా అవగాహన లేదని, అయితే అగ్నిపరీక్ష సమయంలోనే చాలామంది తనను సంప్రదించి పీఆర్ సేవల కోసం డబ్బులు అడిగారని వెల్లడించింది. వారానికి రూ.50 వేల వరకు అడిగిన వారూ ఉన్నారని చెప్పింది. కానీ తాను ఎవరినీ నియమించుకోలేదని, ప్రతి ఒక్కరికీ పీఆర్ సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేసింది.

తన ఎలిమినేషన్‌పై మాట్లాడుతూ.. ఓటింగ్ ఆధారంగా జరిగి ఉంటే కనీసం టాప్-5లో ఉండేదాన్నని, కానీ పరిస్థితులు అలా మారాయని తెలిపింది. తన జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని మానసికంగా బలంగా మారానని, అందుకే ట్రోలింగ్‌ను భయపడనని చెప్పింది. తాము లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవారమని, అద్దె ఇంట్లోనే నివసిస్తున్నామని వెల్లడించింది. కుటుంబ సమస్యలు ఉన్నా వాటిని బయటకు చెప్పుకొని ఏడవడం తన స్వభావం కాదని, ఎప్పటికైనా సొంతిల్లు కట్టుకోవడం తన పెద్ద కల అని భావోద్వేగంగా తెలిపింది.

వ్యక్తిగత జీవితం, వివాహంపై కూడా శ్రీజ తన అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేసింది. తాను మద్యం తాగనని, సిగరెట్‌కు దూరంగా ఉంటానని చెప్పింది. భవిష్యత్తులో తన జీవిత భాగస్వామి మద్యం సేవిస్తే అసలు సహించనని, ఆ అలవాటు మారదనే నమ్మకం తనదని స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత కూడా తన స్వభావం మారదని, ఫేక్‌గా ఉండడం తనకు ఇష్టం లేదని తెలిపింది. ఇప్పటివరకు ప్రేమలో పడలేదని, భవిష్యత్తులో తన భాగస్వామి ఆరడుగుల ఎత్తు, మంచి జుట్టు, ఆర్థికంగా స్థిరమైన వ్యక్తి కావాలని చెప్పింది.

డ్రెస్సింగ్‌పై వచ్చే విమర్శల గురించి ప్రశ్నించగా, తన జీవితాన్ని తాను ఎలా గడపాలో ఇతరులు నిర్ణయించలేరని ఘాటుగా స్పందించింది. సోషల్ మీడియాలో ఎవరైనా తన దుస్తులపై కామెంట్స్ చేస్తే పట్టించుకోనని, తన ఇష్టం వచ్చిన దుస్తులు ధరిస్తానని చెప్పింది. ఎవరికైనా నచ్చకపోతే స్క్రోల్ చేసి వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించింది. తన జీవితం తనదేనని, ఇతరుల అభిప్రాయాల కోసం జీవించనని స్పష్టం చేసింది.

తన కెరీర్ విషయానికి వస్తే.. తాను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా నెలకు సుమారు రూ.2 లక్షల వరకు జీతం పొందేదాన్నని తెలిపింది. బిగ్‌బాస్ అవకాశాన్ని అందుకోవడానికి ఉద్యోగానికి రాజీనామా చేసి ఏడేళ్ల కెరీర్‌ను రిస్క్‌లో పెట్టానని చెప్పింది. ప్రస్తుతం మళ్లీ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నానని వెల్లడించింది. మొత్తం మీద, తన నిర్ణయాలపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని, జీవితాన్ని తన నిబంధనల ప్రకారమే గడపాలని నిర్ణయించుకున్నానని శ్రీజ స్పష్టం చేసింది.

ALSO READ: Birth Date:ఈ తేదీల్లో పుట్టినవారి లైఫ్ బిందాస్!
🏠 Home