🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 February 2026, 9:59 am Posted by : STAR TRINETHRAM

Esther Noronha: ‘ఈ ఏజ్‌లోనూ గోకుతున్నారు’

News Image
Esther Noronha: సినిమా పరిశ్రమ అనగానే చాలామందికి అది కలల ప్రపంచంగా కనిపిస్తుంది. వెలుగులు, కెమెరాల ఫ్లాష్‌లు, భారీ ఫాలోయింగ్‌, పేరు ప్రఖ్యాతులు చూసి సామాన్యులలో ఎందరో తామూ సినీతారలుగా మారాలని ఆశపడతారు. ఆ ఆశతోనే చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి నగరాల వైపు ప్రయాణమవుతారు. కానీ సినీ రంగంలో అడుగుపెట్టిన తర్వాతే అసలు నిజం అర్థమవుతుందని పలువురు నటీనటులు చెబుతుంటారు. అవకాశాలు అంత ఈజీగా రావని, టాలెంట్‌తో పాటు రాజీలు, ఒత్తిళ్లు, కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు కూడా ఎదురవుతాయని అనుభవాలు చెబుతున్నాయి. అధికారాన్ని, హోదాను అడ్డుపెట్టుకుని కొందరు కీలక స్థానాల్లో ఉన్నవారు నటీమణుల జీవితాలతో ఆడుకుంటున్నారన్న ఆరోపణలు కొత్తవేమీ కావు.

చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏదో ఒక నటి తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను, లైంగిక వేధింపుల విషయాలను వెల్లడిస్తూనే ఉంది. బయటకు పెద్ద మనుషుల్లా కనిపించే కొందరి అసలు రూపాన్ని బహిర్గతం చేస్తూ ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే నటీమణులే కాదు, స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్టు ఇప్పటికే పలుమార్లు వెల్లడైంది. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాక సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీశాయి. కెరీర్‌లో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఇంకా కమిట్‌మెంట్ అడుగుతూనే ఉన్నారని ఆమె చెప్పడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

ఈ వ్యాఖ్యలు చేసిన నటి ఎవరంటే ఎస్తర్ నోరోన్హా. ‘భీమవరం బుల్లోడు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ నటి.. ఆ తర్వాత ‘గరం’, ‘జయ జానకి నాయక’ వంటి చిత్రాల్లో నటించింది. హీరోయిన్‌గా స్టార్‌డమ్ దక్కకపోయినా, సహాయక పాత్రలు, ఐటెం సాంగ్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కొన్నిసార్లు బోల్డ్ పాత్రల్లో కనిపించి చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత జీవితంలో సింగర్ నోయెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్తర్, వివాహం జరిగిన కొద్దికాలానికే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు దారుల్లో తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. నోయెల్ సంగీత రంగంలో బిజీగా ఉంటే, ఎస్తర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

ప్రస్తుతం ఎస్తర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ప్రియ, సురేఖవాణి తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. జీవీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావులు నిర్మించారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మంచి హడావుడితో సాగింది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎస్తర్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. కెరీర్ ప్రారంభంలో కొందరు పరోక్షంగా కమిట్‌మెంట్ అడుగుతారని, ఆ సమయంలో అది అర్థం కాకపోవచ్చని ఆమె తెలిపింది. కానీ సంవత్సరాలు గడిచినా కొందరు ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉన్నారని చెప్పింది. రెండు రోజుల క్రితం కూడా తనకు ఇలాంటి కాల్ వచ్చిందని వెల్లడించింది. చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలలో తాము కష్టపడి, టాలెంట్‌తోనే ఎదిగామని, ఎవరూ కమిట్‌మెంట్ అడగలేదని చెబుతారని, కానీ అందులోనూ రకరకాల కేటగిరీలు ఉంటాయని ఎస్తర్ వ్యాఖ్యానించింది. కొందరు ఓపెన్‌గా ఇలాంటివి చేస్తున్నామని కూడా ఒప్పుకుంటారని ఆమె చెప్పింది.

సినిమాల్లో శాలీన పాత్రలు చేస్తూ బయటకు దేవతలలా కనిపించే కొందరు, అవసరమైన సమయంలో మాత్రం వేరేలా ప్రవర్తిస్తారని ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ప్రేక్షకులు తనను చూసి కూడా ఏదో ఒకటి చేసి ఉంటుందనే అనుకుంటారని, కానీ తన ఫిల్మోగ్రఫీని ఎవ్వరూ సరిగ్గా చూడరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేక్షకుల ప్రేమ, మీడియా సపోర్ట్ తనకు ఉందని, ఎంతోమందితో కలిసి పని చేసినప్పటికీ ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని చెప్పింది. అలాంటప్పుడు తాను ఎవరూ అనుకుంటున్న ఆ లీగ్‌లో ఎందుకు పెట్టబడుతున్నానని ప్రశ్నించింది.

ఇన్ని సంవత్సరాలు గడిచినా కొందరు ఇప్పటికీ తాను మారిపోతానేమో, కెరీర్ కోసం తగ్గుతానేమో అన్న ఆశతో ప్రయత్నిస్తూనే ఉన్నారని ఎస్తర్ చెప్పింది. తాను అనుకున్న విధంగా సినీరంగంలో ఎదగలేకపోయానన్న భావనను ఆసరాగా చేసుకుని, ఇప్పటికైనా కమిట్‌మెంట్ ఇస్తుందేమో అని ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించింది. కానీ తాను అలాంటి రాజీలకు ఎప్పటికీ ఒప్పుకోనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ఎస్తర్‌ను ఇప్పటికీ వేధిస్తున్న వారు ఎవరు అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.

ALSO READ: Sports: సెపక్ టక్రా చాంపియన్‌షిప్‌లో భారత జట్లకు ఐదు బంగారు పతకాలు
🏠 Home