🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 February 2026, 9:35 am Posted by : STAR TRINETHRAM

‘ఆపరేషన్ జాక్’ విజయవంతం.. భారీ మగ పులిని పట్టుకున్న రెస్క్యూ టీమ్ (VIDEO)

News Image
తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజుల పాటు ప్రజలను భయాందోళనలకు గురిచేసి, అటవీ అధికారులకు నిద్రలేకుండా చేసిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. ‘ఆపరేషన్ జాక్’ పేరుతో చేపట్టిన ప్రత్యేక చర్యలు విజయవంతం కావడంతో, కూర్మాపురం ప్రాంతంలో ఈ భారీ మగ పులిని అటవీ శాఖ అధికారులు సురక్షితంగా బంధించి విశాఖపట్నంలోని యానిమల్ రెస్క్యూ సెంటర్ (ఏఆర్‌సి)కు తరలించారు. ప్రస్తుతం ఈ పెద్దపులి అక్కడ కఠిన భద్రత, ప్రత్యేక వైద్య పర్యవేక్షణ మధ్య సంరక్షణ పొందుతోంది. అడవుల్లో స్వేచ్ఛగా తిరిగిన పులి ఒక్కసారిగా బోనులోకి రావడంతో తీవ్ర ఒత్తిడికి గురైందని అధికారులు చెబుతున్నారు. కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం అవసరమవుతుందని స్పష్టం చేస్తున్నారు.

https://twitter.com/tupaki_official/status/2019774444450054424?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2019774444450054424%7Ctwgr%5E5e3a6deb862c58c3fdc07a9745f8001f7cbd26bd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Ftupaki_official%2Fstatus%2F2019774444450054424

ఏఆర్‌సి సెంటర్‌కు తీసుకొచ్చిన వెంటనే పులిని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. అయితే బోనులో నుంచి విడుదల చేసి ఎన్‌క్లోజర్‌లోకి పంపగానే ఒక్కసారిగా వేగంగా పరుగు తీసింది. లోపల గాండ్రిస్తూ అటు ఇటు తిరుగుతూ, ఏ చిన్న అవకాశం దొరికినా తప్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రవర్తించింది. ఇది సహజమేనని, అడవుల్లో స్వేచ్ఛగా సంచరించిన జంతువుకు ఒక్కసారిగా పరిమిత వాతావరణం ఎదురైతే ఇలాంటి ఆందోళన కనిపిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. అందుకే పులికి మనుషుల కనబడకుండా ఉండేలా సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పులి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తొలుత ద్రవాహారం మాత్రమే అందిస్తున్నారు. నీటిలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ కలిపి యానిమల్ కీపర్లు పులికి ఇస్తున్నారు. పట్టుబడిన తర్వాత తొలి రెండు మూడు రోజుల పాటు పులి తీవ్ర స్ట్రెస్‌లో ఉంటుందని, ఈ సమయంలో ఘన ఆహారం తీసుకోకపోవడం సాధారణమేనని అధికారులు చెబుతున్నారు. ఎవరైనా కనిపిస్తే మాత్రం ఎన్‌క్లోజర్‌లో గాండ్రిస్తూ తిరుగుతుండటంతో, ఆహారం అందించేటప్పుడు తప్ప సిబ్బంది దాని దగ్గరకు వెళ్లడం లేదు. సీసీ కెమెరాల ద్వారా పులి ప్రతి కదలికను నిరంతరం గమనిస్తున్నారు.

పెద్దపులి ఆరోగ్యం, ప్రవర్తన, ఆహార అలవాట్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం పూర్తిగా ఒత్తిడిలో ఉన్న ఈ పులి ద్రవాహారానికే పరిమితమైంది. అయితే రెండు మూడు రోజుల్లోనే మళ్లీ ఘనాహారం తీసుకునే స్థితికి వస్తుందని యానిమల్ కీపర్లు అంచనా వేస్తున్నారు. ఉదయం గుడ్లు కలిపిన పాలు, సాయంత్రం బీఫ్ ఇవ్వాలని డైట్ ప్లాన్ రూపొందించారు. సీసీఎఫ్ దివాన్ మోహియుద్దీన్ పర్యవేక్షణలో జూ క్యూరేటర్ మంగమ్మ, వెటర్నరీ డాక్టర్ భాను ప్రసాద్ ఈ పులి సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పులుల సంరక్షణలో సుదీర్ఘ అనుభవం ఉన్న యానిమల్ కీపర్ మల్లు ప్రత్యేక శ్రద్ధతో పులిని చూసుకుంటున్నారు.

అటవీ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ పెద్దపులి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తాడోబా- అంధేరి టైగర్ రిజర్వ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి చొరబడినట్లు గుర్తించారు. మూడున్నర సంవత్సరాల వయసున్న ఈ మగ పులి బరువు సుమారు 250 నుంచి 300 కిలోల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శారీరకంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ, మానసికంగా పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. ఎన్‌క్లోజర్‌లో ఉంచినందున స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం అవసరమవుతుందని స్పష్టం చేస్తున్నారు.

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తూ, ఈ పులిని భవిష్యత్తులో జూకు తరలించాలా లేదా తిరిగి అడవుల్లో విడిచిపెట్టాలా అనే అంశంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మాత్రం ప్రజల భద్రత, పులి ఆరోగ్యం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని అత్యంత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు.

ALSO READ: XElectron Techno: రూ.6 వేలలోనే బిగ్ స్క్రీన్.. టీవీలకు చెక్ పడినట్లేనా?
🏠 Home