🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 08 February 2026, 4:54 pm Posted by : STAR TRINETHRAM

విహారయాత్ర సరే.. బడ్జెట్ మాటేంటి..?

News Image
విహారయాత్రకు వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి. కొందరు విదేశాలను చుట్టిరావాలని కలలు కంటారు, మరికొందరు దేశీయంగా కొత్త ప్రదేశాలు చూడాలని అనుకుంటారు. ఇంకొందరు కనీసం దగ్గరలో ఉన్న సందర్శక ప్రాంతాలకైనా వెళ్లాలని భావిస్తారు. ఆలోచన దాకా బాగానే ఉంటుంది కానీ, బడ్జెట్ మాట వచ్చేసరికి చాలా మంది వెనక్కి తగ్గిపోతారు. నెలవారీ ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్ర కోసం ప్రత్యేకంగా డబ్బు కేటాయించడం కష్టమేనని చాలామంది భావిస్తుంటారు. అయితే సరైన ప్లానింగ్ ఉంటే విహారయాత్రకు డబ్బు పెద్ద సమస్య కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

విహారయాత్ర ప్లాన్ చేయాలంటే ముందుగా ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామన్నది స్పష్టంగా నిర్ణయించుకోవాలి. గమ్యస్థానాన్ని బట్టి ఖర్చు పూర్తిగా మారిపోతుంది. విదేశీ ప్రయాణాలైతే విమాన టికెట్లు, వీసా, బస వంటి వాటికి భారీగా ఖర్చవుతుంది. అదే దేశీయంగా లేదా స్థానికంగా అయితే ఖర్చు కొంత నియంత్రణలో ఉంటుంది. ప్రయాణ టికెట్లు, హోటల్ బస, భోజనం, ప్రవేశ రుసుములు వంటి అన్ని ఖర్చులను ముందే అంచనా వేసుకొని ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకునేలా పొదుపు మొదలుపెట్టడం చాలా అవసరం. ఇందుకోసం రికరింగ్ అకౌంట్ తెరవడం లేదా ప్రత్యేకంగా ఒక సేవింగ్స్ అకౌంట్‌ను ట్రావెల్ కోసం కేటాయించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రోజువారీ జీవితంలో చేసే చిన్న పొదుపులే విహారయాత్రకు పెద్ద మొత్తంగా మారుతాయని చెబుతున్నారు. ఆదాయాన్ని బట్టి రోజుకు రూ.100 అయినా సరే ప్రత్యేకంగా పక్కన పెట్టడం అలవాటు చేసుకుంటే ఆరు నెలల్లోనే మంచి మొత్తం జమ అవుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారు ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని ఆటోమేటిక్‌గా ట్రావెల్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యేలా ఏర్పాటు చేసుకుంటే పొదుపు సులభమవుతుంది. అలాగే రోజూ పలుమార్లు బయట టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉంటే వాటిని తగ్గించడం ద్వారా కూడా మంచి మొత్తం ఆదా చేయవచ్చు. చిన్న మొత్తాలే కాలక్రమేణా పెద్ద డబ్బుగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.

వారాంతాల్లో రెస్టారెంట్లలో తినడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అయితే నెలలో రెండు వారాలు బయట తినడం మానేసి, ఆ ఖర్చయ్యే సగటు బిల్లు మొత్తాన్ని పొదుపు చేస్తే అది ట్రావెల్ ఫండ్‌కు బాగా ఉపయోగపడుతుంది. అలాగే అవసరం లేకున్నా తీసుకున్న ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తే వాటికయ్యే డబ్బును విహారయాత్ర బడ్జెట్‌కు మళ్లించుకోవచ్చు. కొన్ని క్రెడిట్ కార్డ్స్ ట్రావెల్ రివార్డ్స్, పాయింట్లను అందిస్తాయి. వాటి ద్వారా విమాన, రైలు టికెట్లు, హోటల్ బుకింగ్స్‌పై డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంటుంది.

సరైన ప్లానింగ్ ఉంటే ప్రయాణ ఖర్చులోనూ భారీగా డబ్బు ఆదా చేయవచ్చు. విమాన, రైలు టికెట్లను కొన్ని నెలల ముందే బుక్ చేసుకుంటే ధరలు తక్కువగా ఉంటాయి. చివరి నిమిషంలో బుక్ చేస్తే విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతాయి, రైలు టికెట్లకు తత్కాల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అలాగే ట్రావెల్ ఏజెన్సీలు, టికెట్ బుకింగ్ సంస్థలు తరచూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. రాయితీలు, గ్రూప్ ప్యాకేజీలు వంటి వాటిని వినియోగించుకుంటే ఖర్చు మరింత తగ్గుతుంది.

గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత క్యాబ్‌లపై ఆధారపడితే ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే స్థానిక బస్సులు, రైళ్లు వంటి ప్రజారవాణా సౌకర్యాలను ఉపయోగిస్తే డబ్బు ఆదా అవుతుంది. టూరిస్ట్ గైడ్‌లను తీసుకుంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అన్ని వివరాలు అందుబాటులో ఉన్నందున ముందే సమాచారం తెలుసుకొని వెళ్తే గైడ్ అవసరం ఉండదు. అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోని హోటల్స్ ఖరీదుగా ఉంటాయి. ఖర్చు తగ్గించుకోవాలంటే క్యాంపింగ్, హాస్టల్స్ వంటి తక్కువ ధర బస సౌకర్యాలను ఎంపిక చేసుకోవచ్చు. సరిగ్గా ప్లాన్ చేస్తే విహారయాత్ర కలను బడ్జెట్‌లోనే సాకారం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ALSO READ: ALERT: వాట్సాప్ నంబర్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త!
🏠 Home