🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 February 2026, 10:45 am Posted by : STAR TRINETHRAM

ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు

News Image
అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా పావులు

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 9వ తేదీన ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. అంటే అభ్యర్థుల చేతిలో ఉన్నది కేవలం ఇవాళ్టితో కలిపి 4 రోజుల సమయమే. ఈ స్వల్ప సమయంలోనే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క అవకాశం కూడా వదులుకోకుండా వ్యూహాలు రచిస్తూ, ఇంటింటా ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు తమ బలాన్ని మొత్తం రంగంలోకి దింపగా, అగ్రనేతలు సైతం ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు.



పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతుండటంతో మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సమయం తక్కువగా ఉండటంతో ఉదయం నుంచి రాత్రి వరకు వార్డులవారీగా పోటాపోటీగా ప్రచార బాట పడుతున్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు తమ తమ మద్దతుదారులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓటర్లను నేరుగా కలుస్తూ సమస్యలు వింటూ, అభివృద్ధి హామీలతో ఓట్లు అభ్యర్థిస్తున్నారు.



ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు, మద్దతుదారులకు అవసరమైన ఏర్పాట్లను అభ్యర్థులు సమర్థంగా చేస్తున్నారు. టీ, టీఫిన్‌ నుంచి మధ్యాహ్న భోజనం, రాత్రి విందు వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రచారంలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ పార్టీ కండువాలు ధరించి, జెండాలు పట్టుకొని ఊరేగింపుల్లా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు మాత్రం ఎన్నికల అధికారులు కేటాయించిన గుర్తులతో ఓటర్ల ముందుకు వెళ్లి తమను గెలిపించాలని కోరుతున్నారు.

వర్ధన్నపేటలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నుంచి 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈగ దామోదర్ తన మద్దతుదారులతో కలిసి ఉదయాన్నే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలుసుకుంటూ, స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి రజిత-సాంబయ్య కూడా తన అనుచరులతో కలిసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు అభివృద్ధే తమ ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తున్నారు.

ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వివిధ వార్డుల్లో ప్రచారం చేపట్టారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. శుక్రవారం 11వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిలివేరు కుమారస్వామి తన మద్దతుదారులతో కలిసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించుతూ మద్దతు కోరుతున్నారు.

బీజేపీ నేతలు కూడా తమ మద్దతుదారులతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులవారీగా పర్యటిస్తూ ఓటర్లను కలుస్తూ, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టామని చెబుతున్నారు. పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతుండటంతో వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ సందడి తారస్థాయికి చేరింది. చివరి నాలుగు రోజులు ఎవరు ఎలా ఓటర్లను ఆకట్టుకుంటారన్నదే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్న అంశంగా మారింది.

ALSO READ: Gas cylinder: మీ ఇంట్లో వంట గ్యాస్ త్వరగా ఐపోతుందా? అయితే ఇలా చేయండి..
🏠 Home