🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 February 2026, 12:51 pm Posted by : STAR TRINETHRAM

Shocking: ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని.. 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు బాలికలు ఆత్మహత్య

News Image
Shocking: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ నగరాన్ని కుదిపేసే హృదయవిదూరక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నగర పరిధిలోని భారత్‌ సిటీ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతులను పాఖి (12), ప్రాచి (14), విషిక (16)గా గుర్తించారు. చిన్న వయసులోనే ముగ్గురు చెల్లెల్లు ఈ విధంగా ప్రాణాలు విడిచిపెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

స్థానికుల కథనం ప్రకారం.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు చిన్ననాటి నుంచే ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. స్నానం చేయడం నుంచి భోజనం, పాఠశాలకు వెళ్లడం, కలిసి చదువుకోవడం, రాత్రి నిద్రపోవడం వరకు ప్రతి చిన్న విషయాన్ని కలిసే చేసుకునే వారు. ముగ్గురి మధ్య బంధం అంత గట్టిగా ఉండేదని, ఒక్కరు లేకుండా మరొకరు ఉండలేని స్థాయిలో అనుబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాంటి అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఈ అఘాయిత్యానికి పాల్పడటం అందరినీ షాక్‌కు గురి చేసింది.

ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ బాలికలు ఆన్‌లైన్ గేమింగ్‌కు తీవ్రంగా బానిసలయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా ‘కొరియన్ లవ్ గేమ్’ అనే టాస్క్ ఆధారిత ఆన్‌లైన్ గేమ్‌ను వారు నిత్యం ఆడేవారని పోలీసులు పేర్కొన్నారు. ఆ గేమ్‌లో నిర్దిష్ట లక్ష్యాలను పూర్తి చేయాల్సి ఉండగా, మానసికంగా ప్రభావం చూపే అంశాలు ఎక్కువగా ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు గేమింగ్‌ను పూర్తిగా మానేయాలని బాలికలను హెచ్చరించినట్లు సమాచారం.

తల్లిదండ్రుల మందలింపుతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్కాచెల్లెళ్లు.. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. చిన్న వయసులో మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, వర్చువల్ ప్రపంచానికి బానిస కావడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ పిల్లల మనస్తత్వంపై చూపే ప్రభావాన్ని తల్లిదండ్రులు, సమాజం గమనించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఆన్‌లైన్ గేమ్ పాత్ర ఎంతవరకు ఉందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ALSO READ: Shocking: నంబర్ బ్లాక్ చేశాడని చంపేసింది
🏠 Home