🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 February 2026, 12:32 pm Posted by : STAR TRINETHRAM

Suicide: ‘అందంగా లేవు, మరోపెళ్లి చేసుకుంటా’ అని చెప్పిన భర్త.. భార్య ఏం చేసిందంటే?

News Image
Suicide: రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని కొత్తపల్లి మండలం రేకుర్తిలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్త వేధింపులు, నిరంతర అవమానాలు, అదనపు వరకట్నం కోసం చేసిన ఒత్తిడిని తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కుటుంబ కలహాలు, మద్యం వ్యసనం, వరకట్న డిమాండ్లు ఒక మహిళ ప్రాణాలకే కాదు.. ఆమె చిన్నారి జీవితానికీ ప్రమాదంగా మారడం ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తోంది.

కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన కోనేటి పోచయ్య కుమార్తె శిరీషారాణి అలియాస్ లహరి (33)కి కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన కుతాడి పోచయ్య రెండో కుమారుడు కుతాడి కిశోర్‌తో 2016లో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ఇద్దరు పిల్లలు జన్మించారు. మొదట కుటుంబ జీవితం సాధారణంగానే సాగినప్పటికీ, కాలక్రమేణా భర్త ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇటీవల కొన్ని రోజులుగా “నువ్వు అందంగా లేవు”, “ఇంకో పెళ్లి చేసుకుంటా” అంటూ కిశోర్ శిరీషారాణిని తీవ్రంగా వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా రూ.5 లక్షల అదనపు వరకట్నం తేవాలని ఒత్తిడి చేయడంతో పాటు మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టాడని ఆమె తన తల్లిదండ్రులకు పలుమార్లు వాపోయినట్లు తెలుస్తోంది. ఈ వేధింపులు తట్టుకోలేక అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లి అక్కడే ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ వ్యవహారంపై గ్రామ పెద్దలు, బంధువులు పంచాయితీ ఏర్పాటు చేసి కిశోర్‌ను పిలిపించి మందలించినట్లు సమాచారం. అప్పట్లో మారుతానని చెప్పి ఇంటికి వెళ్లిన కిశోర్.. కొద్ది రోజులకే మళ్లీ పాత ప్రవర్తనకే తిరిగిపోయాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మద్యం వ్యసనం మరింత పెరగడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిసింది.

సోమవారం రాత్రి కిశోర్ మద్యం సేవించి ఇంటికి రావడంతో మరోసారి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో “మద్యం మానేస్తావా.. లేక నేను విషం తాగాలా” అంటూ శిరీషారాణి భర్తను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే కొద్దిసేపటికి కిశోర్ గడ్డి మందు తీసుకొచ్చి, “తాగితే తాగు.. నేను మాత్రం మద్యం మానను” అని అన్నాడని ఆమె తన తల్లి లక్ష్మికి ఫోన్‌లో కన్నీళ్లతో చెప్పినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న తల్లి లక్ష్మి వెంటనే రేకుర్తికి బయల్దేరగా, ఆమె చేరుకునేలోపే శిరీషారాణి గడ్డి మందు తాగింది. పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందింది. ఈ ఘటనలో మరో విషాదకర అంశం ఏమిటంటే.. ఐదేళ్ల కుమార్తెకు కూడా గడ్డి మందు తాగించినట్లు సమాచారం. అయితే చిన్నారికి ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.

కుమార్తె మృతి వార్త తెలిసిన తండ్రి కోనేటి పోచయ్య తీవ్రంగా కలత చెందారు. తన కుమార్తె మరణానికి భర్త వేధింపులు, వరకట్న డిమాండ్లే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కుతాడి కిశోర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కొత్తపల్లి పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.

ALSO READ: Violence: ఇలా తయారయ్యారేంట్రా బాబు.. భార్య అందంగా ఉందని కత్తితో గుండు గీసిన భర్త!
🏠 Home