🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 February 2026, 12:17 am Posted by : STAR TRINETHRAM

LPG cylinder: గ్యాస్ సిలిండర్ వాడే వారికి గుడ్‌న్యూస్.. రూ.300 కడితే చాలు!..

News Image
LPG cylinder: ఎన్నాళ్లుగానో భారతీయ వంటింట్లో గ్యాస్ సిలిండర్ అంటే బరువైన ఎర్రటి ఇనుప బండే గుర్తుకు వస్తుంది. దాన్ని కదిలించాలన్నా, మార్చాలన్నా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. బరువు సమస్యతో పాటు తుప్పు పట్టడం, భద్రతపై భయం కూడా చాలా కాలంగా వినియోగదారులను వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఇనుప సిలిండర్లు పేలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరటనిచ్చేలా గ్యాస్ సిలిండర్లలోనే విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.

సంప్రదాయ స్టీల్ గ్యాస్ సిలిండర్లకు పూర్తిగా ప్రత్యామ్నాయంగా ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త ‘లైట్’ సిలిండర్ ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చింది. వంటింట్లో రోజూ ఎదురయ్యే బరువు, భద్రత సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఈ సిలిండర్‌ను భావిస్తున్నారు. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ‘భారత్ గ్యాస్ లైట్’ పేరుతో ఈ కొత్త తరహా సిలిండర్‌ను ప్రవేశపెట్టింది. సంప్రదాయ ఇనుప సిలిండర్లకు భిన్నంగా హై డెన్సిటీ పాలిథిలిన్ (HDPE)తో తయారు చేసిన ఈ సిలిండర్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.

సాధారణంగా ఇనుప గ్యాస్ సిలిండర్ గ్యాస్‌తో నిండినప్పుడు దాని బరువు సుమారు 30 నుంచి 33 కిలోల వరకు ఉంటుంది. ఈ కారణంగా సిలిండర్‌ను ఎత్తడం, మార్చడం చాలామందికి కష్టంగా మారుతుంది. అయితే కొత్త కంపోజిట్ ప్లాస్టిక్ సిలిండర్ మాత్రం గ్యాస్ నిండినప్పటికీ కేవలం 15.9 కిలోల బరువే ఉంటుంది. అంటే పాత సిలిండర్‌తో పోలిస్తే దాదాపు సగం బరువే. దీంతో డెలివరీ సిబ్బందితో పాటు ఇంట్లో ఉన్నవారు కూడా సులభంగా దీనిని హ్యాండిల్ చేయగలుగుతారు.

భద్రత విషయంలో ఈ కొత్త సిలిండర్‌ను మరింత ఉన్నతంగా డిజైన్ చేశారు. సంప్రదాయ ఇనుప సిలిండర్లు సాధారణంగా 80 కిలోల వరకు మాత్రమే ప్రెజర్‌ను తట్టుకుంటాయి. కానీ ఈ కొత్త ‘లైట్’ సిలిండర్ ఏకంగా 120 కిలోల వరకు ప్రెజర్‌ను భరించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఇనుప సిలిండర్లు ఒక్కసారిగా ప్రెజర్ పెరిగి పేలిపోవచ్చు. అయితే ఈ కొత్త ప్లాస్టిక్ సిలిండర్ వేడికి కరిగిపోతూ గ్యాస్‌ను నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీని వల్ల పేలుడు ప్రమాదం ఉండదు. అందుకే భద్రత పరంగా ఇది మరింత విశ్వసనీయమైన ఎంపికగా నిలుస్తోంది.

డిజైన్ పరంగానూ ఈ కొత్త సిలిండర్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. బ్లూ, ఎల్లో కలర్ కాంబినేషన్‌తో స్టైలిష్ లుక్‌లో ఇది పాత ఎర్ర సిలిండర్లకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అంతేకాదు ఇందులో ట్రాన్స్‌లూసెంట్ స్ట్రిప్ అనే వినూత్న ఫీచర్‌ను కూడా అందించారు. ఈ పారదర్శక స్ట్రిప్ ద్వారా సిలిండర్‌లో మిగిలిన గ్యాస్ లెవల్ ఎంత ఉందో బయట నుంచే స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీంతో సిలిండర్ అయిపోతుందా లేదా అని అంచనా వేసేందుకు దాన్ని కుదిపి చూసే అవసరం ఉండదు.

ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేయడం వల్ల ఈ సిలిండర్‌కు తుప్పు పట్టే సమస్యే ఉండదు. కిచెన్ ఫ్లోర్‌పై లేదా టైల్స్‌పై మచ్చలు పడే అవకాశం కూడా ఉండదని కంపెనీ చెబుతోంది. దీర్ఘకాలికంగా వాడినా నాణ్యత, లుక్ అలాగే ఉంటాయని వెల్లడించింది. ఆధునిక వంటింటికి తగ్గట్లుగా డిజైన్ చేసిన ఈ సిలిండర్ ముఖ్యంగా పట్టణ ప్రాంత వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంది.

ధరల విషయానికి వస్తే.. కొత్తగా కనెక్షన్ తీసుకునే వినియోగదారులు ఈ ‘లైట్’ సిలిండర్ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా సుమారు రూ.3,350 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే భారత్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు BPCL శుభవార్త చెప్పింది. వారు తమ పాత ఇనుప సిలిండర్‌ను తిరిగి ఇచ్చేస్తే కేవలం రూ.300 అదనపు డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ కొత్త సిలిండర్ వినియోగదారులకు నచ్చకపోతే తిరిగి ఇచ్చి పాత సిలిండర్‌ను మళ్లీ పొందే వెసులుబాటును కూడా కల్పించారు.

ప్రస్తుతం ఈ కొత్త గ్యాస్ సిలిండర్‌ను గోవాలో ప్రారంభించారు. దశలవారీగా హైదరాబాద్, విశాఖపట్నం వంటి మెట్రో నగరాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని BPCL యోచిస్తోంది. తక్కువ బరువు, అధిక భద్రత, ఆధునిక ఫీచర్లతో ఈ కొత్త సిలిండర్ భారతీయ వంటింట్లో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ALSO READ: Wardhannapet: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మానిఫెస్టో విడుదల
🏠 Home