🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 February 2026, 6:46 pm Posted by : STAR TRINETHRAM

Shocking Murder: భర్త గొంతుకోసి చంపి.. వెంటిలేటర్ గ్రిల్‌కు వేలాడదీసి!

News Image
Shocking Murder: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకున్న జంట చివరకు కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టినా, పెళ్లయిన రెండు నెలలకే ఆ ప్రేమ రక్తపాతం అయ్యింది. భర్తను భార్యే కిరాతకంగా హత్య చేయడం, ఆ తర్వాత ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. ప్రేమ, పెళ్లి, కుటుంబం అన్న బంధాలన్నింటినీ మంటగలిపేలా చేసిన ఈ ఘటన వెనుక అసలు కథ పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చింది.

జితేంద్ర కుమార్ యాదవ్, జ్యోతి అనే యువతీ యువకులు తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరువురి ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో గత ఏడాది నవంబర్ 25న బరేలీలో ఘనంగా వివాహం జరిగింది. కొత్త కాపురంతో సంతోషంగా జీవితం మొదలవుతుందని అందరూ భావించినా, వివాహానంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జితేంద్ర ఆన్‌లైన్ జూదానికి బానిస కావడం దంపతుల మధ్య గొడవలకు కారణమైంది. జూదంలో నష్టాలను భర్తించేందుకు భార్య జ్యోతి బ్యాంక్ ఖాతా నుంచి 20 వేల రూపాయలు విత్‌డ్రా చేసి ఆన్‌లైన్‌లో పెట్టడం వివాదానికి దారి తీసింది.

ఈ విషయం తెలిసిన జ్యోతి భర్తను తీవ్రంగా నిలదీసింది. భర్త ఆన్‌లైన్ జూదం మానేయాలని హెచ్చరించినా.. మాటలు వినకపోవడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు చెలరేగాయి. ఈ ఘర్షణలు రోజురోజుకీ తీవ్రమవుతూ చివరకు ప్రాణాంతక మలుపు తీసుకున్నాయి. జనవరి 26న జ్యోతి తన తల్లిదండ్రులు, సోదరుడికి ఫోన్ చేసి ఇంటికి రావాలని పిలిచింది. అప్పటికే ఇంట్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.

గొడవ సమయంలో జ్యోతి తల్లిదండ్రులు జితేంద్ర చేతులు, కాళ్లు బలవంతంగా పట్టుకున్నారు. అదే సమయంలో కోపోద్రిక్తమైన జ్యోతి.. భర్త గొంతు కోసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో జితేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు నిందితులు మరో నాటకానికి తెరలేపారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని ఇంట్లోని వెంటిలేటర్ గ్రిల్‌కు వేలాడదీసి, జితేంద్ర ఉరివేసుకున్నాడంటూ ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న ఇజ్జత్‌నగర్ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదికలో జితేంద్ర మృతి ఆత్మహత్య కాదని, స్పష్టమైన హత్యగా తేలడంతో కేసు దిశ మారింది. లోతైన విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భార్య జ్యోతి, ఆమె తండ్రి కాళీచరణ్, తల్లి చమేలిలను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. విచారణలో ముగ్గురూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.

ఈ ఘటనలో జ్యోతి సోదరుడు కీలక పాత్ర పోషించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమగా మొదలైన బంధం చివరకు ప్రాణాలు తీసే స్థాయికి చేరుకోవడం, కుటుంబ సభ్యులే హత్యకు సహకరించడంపై స్థానికులు విస్తుపోతున్నారు. ఈ ఘటన మరోసారి కుటుంబ కలహాలు, వ్యసనాల వల్ల కలిగే ప్రమాదాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది.

ALSO READ: Affair: మామపై పెట్రోల్ పోసి నిప్పటించిన కొడలి ప్రియుడు
🏠 Home