🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 February 2026, 9:29 am Posted by : STAR TRINETHRAM

PM Modi: 140 కోట్ల ప్రజల ఆశలకు ప్రతిబింబంగా బడ్జెట్

News Image
మౌలిక వసతుల అభివృద్ధికి భారీ కేటాయింపులు

యువశక్తి ప్రోత్సాహానికి కీలక నిర్ణయాలు

భారత్ డేటా సెంటర్ హబ్‌గా మారే దిశగా అడుగులు

నారీశక్తిని ప్రతిబింబించిన కేంద్ర బడ్జెట్

ఈశాన్య భారత అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్
PM Modi: దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన కేంద్ర బడ్జెట్-2026 భారత్‌కు స్పష్టమైన రోడ్ మ్యాప్‌గా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ బడ్జెట్ కీలకమైన అడుగుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని 140 కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఈ బడ్జెట్‌లో ప్రతిబింబించాయని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఈ బడ్జెట్ కేవలం ఆర్థిక లెక్కల సమాహారం మాత్రమే కాదని, దేశాన్ని దీర్ఘకాలిక అభివృద్ధి బాటలో నడిపించే వ్యూహాత్మక పత్రంగా అభివర్ణించారు. రానున్న కాలంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఆత్మనిర్భర్ భారత్‌కు బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం
ఈ బడ్జెట్‌లో ఆత్మనిర్భర్ భారత్ భావనకు పెద్దపీట వేశామని ప్రధాని మోడీ తెలిపారు. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ, స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకునేలా విధానాలు రూపొందించామన్నారు. లోకల్ టు గ్లోబల్ దిశగా భారత్ ఇప్పటికే బలమైన అడుగులు వేస్తోందని, ఈ బడ్జెట్ ఆ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
మౌలిక వసతులకు మరింత ఊతం
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో గణనీయమైన కేటాయింపులు చేసినట్లు ప్రధాని తెలిపారు. రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు వంటి రంగాల్లో పెట్టుబడులు పెరగడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని చెప్పారు. ఈ అభివృద్ధి దేశంలోని ప్రతి ప్రాంతాన్ని వృద్ధి బాటలో నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు.
యువశక్తిపై ప్రత్యేక దృష్టి
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. యువశక్తిని ప్రోత్సహించే విధంగా ఈ బడ్జెట్ రూపొందించామని చెప్పారు. గేమింగ్, టూరిజం, క్రీడలు, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌లకు అనుకూల వాతావరణం ఏర్పడేలా విధానాలు తీసుకొచ్చామని వివరించారు.
భారత్ డేటా సెంటర్ హబ్‌గా మారే దిశగా అడుగులు
భారత్‌ను డేటా సెంటర్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు ట్యాక్స్ హాలీడే ప్రకటించామని, దీని ద్వారా భారీ పెట్టుబడులు దేశానికి రానున్నాయని తెలిపారు. ఈ రంగం ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని ఆయన అన్నారు.
సంస్కరణలకు కొత్త ఊపిరి
వికసిత్ భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేసే విధంగా ఈ బడ్జెట్ సంస్కరణలకు కొత్త ఉత్సాహం ఇస్తుందని ప్రధాని చెప్పారు. ఆర్థిక పారదర్శకత, డిజిటలైజేషన్, గవర్నెన్స్ మెరుగుదల వంటి అంశాల్లో బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.
నారీశక్తికి ప్రతిబింబంగా కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ నారీశక్తిని ప్రతిబింబిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక చారిత్రాత్మక రికార్డు నెలకొల్పారని ఆయన ప్రశంసించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి, ఆర్థిక భద్రతకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.
ఈశాన్య భారతంపై ప్రత్యేక దృష్టి
ఈసారి బడ్జెట్‌లో ఈశాన్య భారత ప్రాంతాల అభివృద్ధి, పర్యాటకంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. మౌలిక వసతులు, కనెక్టివిటీ, టూరిజం అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతుందని చెప్పారు.
ALSO READ: దారుణం.. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టింది (VIDEO)
🏠 Home