🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 January 2026, 11:35 am Posted by : STAR TRINETHRAM

మహిళల ముందు తలెత్తుకోలేకపోతున్నాం.. మా ఊరిపేరు మార్చండయ్యా!

News Image
ఏ గ్రామానికైనా ఆ ఊరి పేరు అక్కడి ప్రజలకు గుర్తింపు, గర్వానికి ప్రతీక. కానీ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండల పరిధిలోని ఒక కుగ్రామానికి మాత్రం అదే పేరు తీవ్ర అవమానంగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో ఆ గ్రామానికి అసభ్యార్థం వచ్చేలా ఉన్న పాత పేరు కొనసాగుతుండటంతో అక్కడ నివసిస్తున్న సుమారు 150 కుటుంబాలు ఎన్నేళ్లుగా మానసిక వేదనను అనుభవిస్తున్నాయి. ఊరి పేరు పలికే సందర్భం వచ్చిన ప్రతీసారి వారు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వంజీరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే సామాన్య ప్రజల నివాసం. కాగజ్‌నగర్ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఊరి పేరు కారణంగా వీరు బయటి ప్రపంచంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికార కార్యాలయాలకు వెళ్లినప్పుడు తమ గ్రామం పేరు చెప్పేందుకు కూడా సంకోచించాల్సి రావడం అక్కడి ప్రజల బాధను స్పష్టంగా చూపిస్తోంది.

ప్రత్యేకంగా రెవెన్యూ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు ఉన్నప్పుడు గ్రామ పేరు నోటితో చెప్పలేక, కాగితంపై రాసి చూపించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఎంతటి అవమానకరమో గ్రామస్థులు చెప్పుకుంటున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఈ పేరుతో ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు. గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల్లో తమ ఊరి పేరు చెప్పే సమయంలో అపహాస్యం ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు. సర్టిఫికెట్లలో, ఇతర దరఖాస్తుల్లో ఊరి పేరు నమోదు చేయాల్సిన సందర్భంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే చదువుపై కూడా ప్రభావం పడుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అవమానాన్ని ఇక భరించలేక గ్రామస్థులు దాదాపు 20 ఏళ్ల క్రితమే తమ ఊరి పేరు (లం***గూడ)ను ‘నందిగూడ’గా మార్చుకున్నారు. గ్రామ ప్రవేశద్వారం వద్ద కొత్త పేరుతో బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇతర శాఖల పత్రాల్లో నందిగూడ అనే పేరు నమోదు అయింది. అయితే కీలకమైన రెవెన్యూ రికార్డులు, పహాణీలు, భూమి పత్రాల్లో మాత్రం ఇప్పటికీ పాత పేరే కొనసాగుతోంది. దీనివల్ల భూముల క్రయవిక్రయాలు, ఇతర అధికారిక ప్రక్రియల సమయంలో తప్పనిసరిగా పాత పేరు వాడాల్సి వస్తోంది. ఇది గ్రామస్థులకు తీరని వేదనగా మారింది.

ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గ్రామస్థులు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబును ఆశ్రయించారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆయన ఈ అంశాన్ని శాసనసభలో ప్రస్తావించారు. ఒక గ్రామానికి గౌరవప్రదమైన పేరు ఉండటం అక్కడి ప్రజల మౌలిక హక్కు అని పేర్కొంటూ, వెంటనే రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. అయినా ఇప్పటి వరకు అధికారుల నుంచి స్పష్టమైన చర్యలు కనిపించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో ఊరి పేరు కోసం ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. తమ గౌరవం కోసం పోరాటం తప్పదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.

ALSO READ: Medaram: గద్దెపైకి సమ్మక్క
🏠 Home