🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 January 2026, 1:11 pm Posted by : STAR TRINETHRAM

Ponguleti Srinivas Reddy: దక్షిణ భారత కుంభమేళాగా ‘మేడారం’

News Image
రికార్డు స్థాయిలో భక్తుల తాకిడి

ఒక్కరోజులోనే 80 లక్షల మంది దర్శనం

కోటికి చేరనున్న భక్తుల సంఖ్య

భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి

భవిష్యత్తులో ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ‘మేడారం’

: మంత్రులు పొంగులేటి, సీతక్క

తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం మేడారంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక్కరోజులోనే సుమారు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, సమ్మక్క గద్దెపైకి అమ్మవారు వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించే అవకాశం ఉందని అధికారులు అంచనాలను వెల్లడించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు.

మేడారం జాతరను కేవలం తాత్కాలిక ఏర్పాట్లతో కాకుండా శాశ్వతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరో 41 ఎకరాల భూసేకరణ కొనసాగుతోందని చెప్పారు. మొత్తం సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, మరిన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ప్రాధాన్యతను మరింత పెంచేందుకు బాసర నుంచి భద్రాచలం వరకు రూ.2,500 కోట్లతో టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధితో పాటు మేడారం ఆలయాన్ని కూడా ఈ సర్క్యూట్‌లో భాగం చేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని విస్తరించడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

జంపన్న వాగు అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పొంగులేటి తెలిపారు. ఏడాది పొడవునా వాగులో నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం రామప్ప- లక్నవరం నుంచి జంపన్న వాగు వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని చెప్పారు. వాగుపై చెక్‌డ్యామ్‌లు నిర్మించి శాశ్వత నీటి నిల్వకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

మేడారం ప్రాంతానికి ఇప్పటికే సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని మంత్రి తెలిపారు. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కుల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేపట్టనున్నట్లు చెప్పారు. గతంలో ఇరుకైన రోడ్ల వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈసారి ఫోర్-లేన్ రోడ్లతో రాకపోకలు చాలా సులభమయ్యాయని వివరించారు. భవిష్యత్తులో మేడారం ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు.

సోషల్ మీడియాలో మేడారం జాతరపై వస్తున్న దుష్ప్రచారాలను భక్తులు నమ్మవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుంటోందని, అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. భక్తుల భద్రత, ఆరోగ్యం, రాకపోకలు, నీటి సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు.

అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ.. ఈసారి రెండు రోజుల్లోనే 70 నుంచి 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో, మంత్రి పొంగులేటి పర్యవేక్షణలో అతి తక్కువ సమయంలోనే ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో శాశ్వత తాగునీటి వ్యవస్థ, పెద్ద సంఖ్యలో మరుగుదొడ్లు, విస్తృతంగా చెట్ల పెంపకం అవసరమని అభిప్రాయపడ్డారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తల్లులు గద్దెల నుంచి తిరిగి వనప్రవేశం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అప్పటివరకు భక్తులు ఓపికతో దర్శనాలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతర విజయవంతానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగం, మీడియాకు సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

ALSO READ: కేసీఆర్‌కు నోటీసులు.. స్పందించిన కేటీఆర్
🏠 Home