🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 January 2026, 5:33 am Posted by : STAR TRINETHRAM

VHP: రేపు, ఎల్లుండి సెలవులు ఇవ్వాలని డిమాండ్

News Image
VHP: మేడారం మహాజాతర నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సెలవుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అధికారిక సెలవులు ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జాతర ప్రధాన రోజులు అయిన ఈ నెల 30, 31 తేదీలకు రెండు రోజులు సెలవులు ఇవ్వాలని స్పష్టం చేసింది.



మేడారంలోనే క్యాబినెట్ భేటి నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పటికీ సెలవులపై ప్రకటన ఎందుకు చేయడం లేదని వీహెచ్‌పీ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మేడారం జాతరను ప్రపంచ స్థాయి వేడుకగా ప్రచారం చేస్తూ, ఆ స్థాయికి తగిన గుర్తింపు మాత్రం ఇవ్వడం లేదని వీహెచ్‌పీ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ బాలస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన జాతరను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, మేడారంలో భక్తుల రద్దీ రోజు రోజుకీ పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. సంప్రదాయ ప్రకారం జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి, అనంతరం సమ్మక్క సారలమ్మకు బంగారాన్ని సమర్పిస్తున్నారు.

జాతరలో తొలి ఘట్టం పూర్తయ్యింది. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల మీదకు రావడంతో ఉత్సవ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దె వద్దకు చేరుకోవడంతో భక్తుల్లో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. ఈ రోజు సాయంత్రం చిలుకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తుల రద్దీతో మేడారం పూర్తిగా జనసంద్రంగా మారింది. అడుగడుగునా భక్తుల కదలికలు కనిపిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

మేడారం జాతరలో ప్రభుత్వ ప్రతినిధుల హాజరు కూడా కొనసాగుతోంది. తెలంగాణ మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో కలిసి సారలమ్మ గద్దెల వైపు వచ్చారు. మరోవైపు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రావు జాతర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క థింసా నృత్యం చేసి భక్తులను ఆకట్టుకున్నారు. సంప్రదాయ నృత్యాలు, గిరిజన సంస్కృతి ప్రతిబింబించే కార్యక్రమాలు జాతర శోభను మరింత పెంచాయి. శివసత్తుల పూనకాలు కూడా భక్తులకు కనుల పండుగగా నిలిచాయి. ఆధ్యాత్మిక వాతావరణంతో మేడారం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

ALSO READ: Inspiration: భార్యాభర్తలకు ఒకేసారి గ్రూప్-2 ఉద్యోగాలు
🏠 Home