🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 January 2026, 7:34 pm Posted by : STAR TRINETHRAM

PM Kisan: 30 లక్షల మంది రైతుల పేర్లు తొలగింపు.. లిస్ట్‌లో పేరు చెక్ చేసుకోండిలా!

News Image
PM Kisan: రైతులకు మరో కీలక అలర్ట్‌ వచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే రూ.2 వేల విడత కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. రాబోయే ఫిబ్రవరి నెలలోనే ఈ నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న తప్పు చేస్తే మాత్రం ఈ సాయం మీకు అందకుండా ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి రైతు తప్పనిసరిగా కొన్ని విషయాలను ముందే తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ 2026 కేంద్ర బడ్జెట్ పూర్తయ్యాక, ఫిబ్రవరి చివరి వారంలో రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. పంట పెట్టుబడులకు ఇది కీలక సహాయంగా మారింది.

గతంలో విడుదలైన 21వ విడత సమయంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అర్హత లేని వారిని గుర్తించి దాదాపు 30 లక్షల మంది రైతులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది. దీంతో ఈసారి రైతులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ-కేవైసీ పూర్తి చేయని వారి ఖాతాల్లో డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంది.

ఈసారి నిధులు అందాలంటే ఆధార్‌తో బ్యాంక్ ఖాతా అనుసంధానం తప్పనిసరి. అలాగే రైతు ఐడీ, ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి. ప్రభుత్వం చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనల్లో అనేక అవకతవకలు వెలుగుచూశాయి. ఒకే కుటుంబంలో భర్త, భార్య ఇద్దరూ లబ్ధి పొందడం, మైనర్ల పేర్లపై కూడా నిధులు తీసుకోవడం వంటి అంశాలు బయటపడ్డాయి. నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది.

రైతులు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో ముందే చూసుకోవాలి. ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు నమోదు చేస్తే గ్రామ స్థాయిలో లబ్ధిదారుల పూర్తి జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉంటేనే రాబోయే విడత నిధులు ఖాతాలో జమవుతాయి.

ఒకవేళ జాబితాలో పేరు కనిపించకపోతే భయపడాల్సిన అవసరం లేదు. నో యువర్ స్టేటస్ ఆప్షన్ ద్వారా వ్యక్తిగత స్థితిని తనిఖీ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఇన్‌ఎలిజిబుల్ అని చూపిస్తే వెంటనే స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించి అవసరమైన పత్రాలతో లోపాలను సరిచేసుకోవాలి.

ప్రభుత్వం ప్రధానంగా 5 కారణాలతో రైతులను అనర్హులుగా ప్రకటిస్తోంది. ఆదాయపు పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేయని వారు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పీసీఐ మ్యాపింగ్ లేకపోవడం కూడా డబ్బులు రాకపోవడానికి ప్రధాన కారణంగా మారుతోంది. ఈ లోపాలను ముందే సరిచేస్తే నిధులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇప్పటివరకు ఈ పథకం కింద 21 విడతలుగా నిధులు విడుదలయ్యాయి. సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమవుతాయి. ఈసారి పరిపాలనా కారణాల వల్ల స్వల్ప ఆలస్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఫిబ్రవరి మూడవ లేదా నాలుగవ వారంలో రైతుల ఫోన్‌లకు మెసేజ్‌లు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయాన్ని పూర్తిగా పొందాలంటే రైతులు ముందే అన్ని వివరాలు సరిచూసుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ: మెటాపై అమెరికాలో దావా
🏠 Home