🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 January 2026, 6:44 pm Posted by : STAR TRINETHRAM

పాత బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులను తీసుకోవడం ఎలా..?

News Image
బ్యాంక్ ఖాతాను కొన్నేళ్ల పాటు ఉపయోగించకుండా వదిలేస్తే అది ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అకౌంట్‌గా మారుతుంది. అలా మారిన తర్వాత ఖాతాదారుడు నేరుగా డబ్బులు తీసుకునే అవకాశం ఉండదు. చాలా మందికి ఈ విషయం తెలిసినా.. అకౌంట్ తిరిగి యాక్టివ్ చేసుకునే విధానం గురించి స్పష్టమైన అవగాహన ఉండదు. అలాగే ఖాతాదారుడు మరణించిన తర్వాత ఆ అకౌంట్‌లో ఉన్న డబ్బులను కుటుంబ సభ్యులు ఎలా పొందాలన్న విషయంపై కూడా సందిగ్ధత కొనసాగుతోంది.

ఈ సమస్యలకు పరిష్కారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక స్పష్టమైన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పాతగా మారిపోయిన లేదా ఇనాక్టివ్ అయిన బ్యాంక్ ఖాతాలను గుర్తించి, అందులో ఉన్న డబ్బులను సులభంగా క్లెయిమ్ చేసుకునేలా ఈ కొత్త నిబంధనలు రూపొందించారు. దీని ద్వారా సాధారణ ఖాతాదారులతో పాటు నామినీలకు కూడా సులువైన మార్గం అందుబాటులోకి వచ్చింది.

ఇనాక్టివ్ అకౌంట్‌లో ఉన్న డబ్బులను తిరిగి పొందాలంటే సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ అన్‌క్లెయిమ్డ్ ఫారం నింపి సమర్పించాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని బ్యాంక్‌కు అందించాల్సి ఉంటుంది. ఈ పత్రాల ఆధారంగా బ్యాంక్ సిబ్బంది ఖాతాదారుడి వివరాలను ధృవీకరిస్తారు.

ధృవీకరణ అనంతరం ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఇనాక్టివ్ అకౌంట్ మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఖాతాలో ఉన్న మొత్తాన్ని వడ్డీతో సహా ఖాతాదారుడికి చెల్లిస్తారు. దీంతో సంవత్సరాలుగా ఉపయోగించని ఖాతాల్లో ఉన్న డబ్బులు తిరిగి ఖాతాదారుల చేతికి చేరే అవకాశం ఉంటుంది.

ఖాతాదారుడు మరణించిన సందర్భంలో నామినీ ఉన్నట్లయితే, అతడికి లేదా ఆమెకు నేరుగా డబ్బులు అందజేస్తారు. నామినీ లేని పరిస్థితుల్లో చట్టబద్ధమైన వారసులు అవసరమైన పత్రాలు సమర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన మొత్తాలను కూడా ఇదే విధానంలో తిరిగి పొందవచ్చు.

10 సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు జరగని పొదుపు ఖాతాలు, కరెంట్ అకౌంట్లు, మెచ్యూరిటీ పూర్తయినా క్లెయిమ్ చేయని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లోన్ లేదా క్యాష్ క్రెడిట్ అకౌంట్లలో బకాయిలు సర్దిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్‌లను అన్‌క్లెయిమ్డ్‌గా పరిగణిస్తారు. అలాగే డ్రాఫ్టులు, పే ఆర్డర్లు, బ్యాంకర్ చెక్కులు, నెఫ్ట్ బదిలీలు వంటి క్లెయిమ్ చేయని లావాదేవీలూ ఈ జాబితాలోకి వస్తాయి.

రూపాయితో సమానమైన విలువ ఉన్న విదేశీ కరెన్సీ డిపాజిట్లను కూడా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల కేటగిరీలోకి ఆర్బీఐ చేర్చింది. బ్యాంకులు నెలవారీగా ఇలాంటి ఖాతాలపై సమీక్ష నిర్వహించాలి. పదేళ్లు పూర్తయిన తర్వాత కూడా ఖాతాదారులు క్లెయిమ్ చేయని నిధులను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం వల్ల ఖాతాదారుల డబ్బుకు భద్రత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

ALSO READ: Bats: గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వేలాడుతాయంటే..?
🏠 Home