🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 January 2026, 6:17 pm Posted by : STAR TRINETHRAM

గద్దెకు చేరిన సారలమ్మ

News Image
వేలాదిగా తరలివచ్చిన భక్తులు

సంప్రదాయ పూజలు.. పసుపు కుంకుమలతో ఆచారాలు

పూజారి ఇంటి నుంచి గద్దె వరకు సారలమ్మ ఊరేగింపు

డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తుల పూనకాలు

దర్శనానికి పోటెత్తిన భక్తులు

50 మంది వైద్య బృందంతో వైద్య సేవల విస్తరణ

ఉచిత వైద్య శిబిరంతో సంరక్ష ఆసుపత్రి సేవలు

శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా పోలీసుల అప్రమత్తత

స్టార్ త్రినేత్రం, వరంగల్: మినీ మేడారంగా పేరుగాంచిన అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. అడుగడుగునా భక్తుల జయజయధ్వానాలతో అగ్రంపాడు పరిసర ప్రాంతాలు మార్మోగిపోయాయి. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు తరలిరావడంతో జాతర ప్రాంగణం భక్తజన సందోహంగా మారింది. వనదేవతల ఆగమనంతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

జాతర ప్రారంభంలో భాగంగా పూజారులు సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, ఘటాలు, వరాల కుండలను వనంతో పాటు గద్దెలకు తీసుకొచ్చారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ పూజలు జాతరకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తూ వడ్డెలు కైంకర్యాలు నిర్వహించారు.

సారలమ్మ పూజారి గుల్లపెల్లి సాంబశివరావు నివాసం నుంచి అమ్మవారిని భాజా భజంత్రీలు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ గద్దెకు తీసుకొచ్చారు. ఊరేగింపు సాగిన ప్రతి క్షణం భక్తులను ఉత్సాహంతో ఉర్రూతలూగించింది. ఎదురుకోళ్లు ఎగురవేస్తూ భక్తులు పొర్లుదండాలు పెట్టి అమ్మవారిని దర్శించుకున్నారు.

అమ్మవారి దర్శనంతో భక్తులు భక్తి పరవశ్యంలో మునిగిపోయారు. కొందరు కన్నీళ్లతో మొక్కులు చెల్లించగా, మరికొందరు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు, నిలువెత్తు బంగారంతో వనదేవతలను దర్శించుకుంటూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.

ఈ జాతరలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా వైద్య సేవలు ఏర్పాటు చేశారు. ఆత్మకూర్ మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన నేతృత్వంలో సుమారు 50 మంది వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. సంరక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు తక్షణ చికిత్స అందిస్తున్నారు.

భద్రతా పరంగా పోలీస్ శాఖ ప్రత్యేక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రాకపోకలను సులభతరం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

జాతర ప్రత్యేక అధికారిగా ఆర్డీవో నారాయణ, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షణ కొనసాగుతోంది. ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు పారిశుధ్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అందిస్తున్నారు. మార్కెట్ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి, మాజీ చైర్మన్ బోరిగం స్వామి, చైర్మన్ వంచ రంగారెడ్డి, అగ్రంపాడు సర్పంచ్ గంగుల మహేందర్, ఈవో నాగేశ్వరరావు, పూజారులు జాతర ఏర్పాట్లను సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు.

మొత్తంగా అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర భక్తి, సంప్రదాయం, సేవా కార్యక్రమాల సమ్మేళనంగా కొనసాగుతోంది. మినీ మేడారంగా గుర్తింపు పొందిన ఈ జాతర మరోసారి ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ఘనంగా సాగుతోంది.

ALSO READ: సమ్మక్క సారలమ్మ జాతరకు కేంద్రమంత్రి జుయల్ ఓరం
🏠 Home