🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 January 2026, 1:45 pm Posted by : STAR TRINETHRAM

Telangana: వివాహ రిజిస్ట్రేష‌న్ల కోసం మినీ మ్యారేజీ హాల్‌

News Image
Telangana: తెలంగాణ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లుగా స్వార్థపూరిత నిర్ణయాలు, అవ్యవస్థ కారణంగా రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు, సూచనల మేరకు గత రెండేళ్లుగా వ్యవస్థను సరిదిద్దుతూ ప్రజలకు సేవలు చేరువ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.



మంగళవారం సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ కార్యాలయాల ఏర్పాటుపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 క్లస్టర్లుగా విభజించి, ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రైవేటు నిర్మాణ సంస్థల సహకారంతో ఆధునిక భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణంతో పాటు ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా ఆయా సంస్థలే తీసుకుంటాయని పేర్కొన్నారు.

3 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు నిర్మిస్తున్నామని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. వివాహ రిజిస్ట్రేషన్ల కోసం మినీ మ్యారేజ్ హాల్స్, గర్భిణీలు, వృద్ధుల కోసం ప్రత్యేక సదుపాయాలు, విశాలమైన వెయిటింగ్ ఏరియా, మహిళల కోసం ఫీడింగ్ రూమ్, చిన్నపిల్లల కోసం క్రెచ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ఆధునిక లిఫ్ట్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.

త్వరలో మిగిలిన కార్యాలయాలకు శంకుస్థాపనలు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రెండో దశలో జిల్లా కేంద్రాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ భవనాలు నిర్మించే దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే తాలిమ్ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, జూన్ 2 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ఇటీవల మేడ్చల్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ భవనానికి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేసిన మంత్రి.. బుధవారం పటాన్ చెరు- శంకరపల్లి ప్రధాన రహదారి సమీపంలో రాజపుష్ప కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మించనున్న భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో స్లాట్ బుకింగ్, ఈ ఆధార్ సంతకం వంటి ఆధునిక సదుపాయాల వల్ల ప్రజల సమయం ఎంతో ఆదా అవుతోందన్నారు.

రెవెన్యూ శాఖలో అమలు చేస్తున్న ఈ సంస్కరణలు కేవలం కార్యాలయాల రూపురేఖలకే పరిమితం కావని, ప్రజల దైనందిన జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకొచ్చే విధంగా ఉంటాయని పొంగులేటి స్పష్టం చేశారు. పారదర్శకత, వేగం, బాధ్యతాయుత పాలన ఈ మార్పుల ప్రధాన లక్ష్యాలని అన్నారు.

అదే సమయంలో జర్నలిస్టుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పాత్రికేయుల భద్రత, వృత్తి గౌరవం, సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ అంశంపై అన్ని సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకుని గతంలో జారీ చేసిన జీవోలో మార్పులు చేసి కొత్త జీవోను విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఎలాంటి ఆడంబరాలు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ALSO READ: Aroori Ramesh: బీజేపీకి ఆరూరి రమేష్ రాజీనామా.. త్వరలో బీఆర్ఎస్‌లో చేరిక
🏠 Home