‘సూసైడ్ చేసుకోవాలని ఉంది’.. సస్పెండెడ్ టీచర్ ఆవేదన
సోషల్ మీడియా యుగంలో రీల్స్ మోజు ఎంతగా పెరిగిందంటే, అది బాధ్యతాయుతమైన ఉద్యోగాలకూ ప్రమాదంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గౌతమి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన సమయంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, ప్రైవేటు విద్యాసంస్థలు, కమర్షియల్ బ్రాండ్లకు ప్రచారం చేశారన్న ఆరోపణలతో ఆమెను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడిన తర్వాత గౌతమి మరోసారి సోషల్ మీడియా ద్వారా స్పందించడం వివాదానికి మరింత దారితీసింది.
సస్పెన్షన్ తర్వాత విడుదల చేసిన రీల్స్ వీడియోలో గౌతమి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి నేరం చేయలేదని, గంజాయి అమ్మినవాళ్లలా లేదా హత్యలు చేసినవాళ్లలా తనను చూస్తున్నారని ఆమె వాపోయారు. తెలియక తప్పు జరిగిందని అంగీకరిస్తూనే, ఒక్క అవకాశం ఇవ్వాలని కన్నీటి పర్యంతమయ్యారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ను తట్టుకోలేకపోతున్నానని, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నానని చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.
అయితే గౌతమిపై వచ్చిన ఆరోపణలు ఒక్కరోజు లేదా ఒక్క ఘటనకు సంబంధించినవి కావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె ప్రవర్తనపై ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ప్రైవేటు సంస్థల ప్రకటనలు చేయడం, పాఠశాల సమయంలో విద్యార్థులను పట్టించుకోకుండా రీల్స్ తయారు చేయడం వంటి అంశాలపై ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఆమె తీరులో మార్పు రాలేదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారించుకున్న తర్వాతే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కఠినంగా స్పందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యత ఉందని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాత్రను విస్మరించి సోషల్ మీడియా మోజులో పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపే ఉపాధ్యాయుల ప్రధాన కర్తవ్యమని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా శాఖాపరమైన చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా గౌతమి ఆవేదనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె చేసిన తప్పును అంగీకరించి, సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాతైనా పూర్తిగా బోధనపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రమాదంలో పెట్టుకోవద్దని హితవు పలుకుతున్నారు. మరోవైపు మరికొందరు మాత్రం ఉద్యోగం మానేసి పూర్తిస్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియా ప్రభావం, ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలపై విస్తృత చర్చకు దారితీస్తోంది.
ALSO READ: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. ఆస్పత్రుల్లో రూ.20 లక్షల వరకు ఉచిత వైద్యం