పద్మశ్రీ గౌరవం.. నటుడు రాజేంద్రప్రసాద్ భావోద్వేగం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక గర్వకారణంగా నిలిచింది ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ పురస్కారం లభించడమే. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమాల్లో తనదైన హాస్యంతో, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రాజేంద్ర ప్రసాద్‌కు ఈ గౌరవం లభించడం పట్ల సినీ వర్గాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్ర ప్రసాద్ ఓ వీడియో విడుదల చేసి తన భావాలను అభిమానులతో పంచుకున్నారు. పద్మశ్రీ పురస్కారం తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని, ఈ అవార్డు తన ఒక్కడికే పరిమితం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని ప్రేమించే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
తాను ఈ స్థాయిలో నిలబడటానికి, ఇంతటి గుర్తింపు పొందటానికి ముఖ్య కారణం ప్రేక్షకులేనని ఆయన భావోద్వేగంగా చెప్పారు. గత 48 ఏళ్లుగా తాను ఏ వేషం వేసినా, ఎలాంటి ప్రయోగం చేసినా ప్రేక్షకులు అపారమైన ప్రేమతో ఆదరించారని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రేమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అన్నారు.
తనలాంటి ఓ సాధారణ నటుడిని కుటుంబ సభ్యుడిలా ఆదరించి, “నటకిరీటి”గా నిలబెట్టిన ఘనత ప్రేక్షకులకే దక్కుతుందని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రేక్షకుల చప్పట్లే తనకు బలమని, ఆ ఋణాన్ని జీవితాంతం తీర్చుకోలేనని ఆయన భావోద్వేగంతో చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని ప్రేక్షకులు తనను ఆశీర్వదించారని, అలాంటి అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ వీడియోలో తెలిపారు.
తెలుగు సినిమాల్లో హాస్యానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నటుల్లో రాజేంద్ర ప్రసాద్ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కథానాయకుడిగా, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక రకాల పాత్రల్లో ఒదిగిపోయిన ఆయన నటన ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంది. అలాంటి నటుడికి పద్మశ్రీ లభించడం తెలుగు సినిమా స్థాయిని మరోసారి దేశవ్యాప్తంగా చాటిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ అవార్డుతో రాజేంద్ర ప్రసాద్ ప్రయాణం మరింత స్ఫూర్తిదాయకంగా మారిందని, రాబోయే తరాల నటులకు ఇది ఓ మార్గదర్శకంగా నిలుస్తుందని అభిమానులు అంటున్నారు. ప్రేక్షకులతో ఏర్పడిన ఆత్మీయ బంధమే తన అసలైన సంపద అని మరోసారి రాజేంద్ర ప్రసాద్ మాటలు నిరూపించాయి.
ALSO READ: Madaram: జాతరలో మొదటి రోజు ఏం జరుగుతుందో తెలుసా?