Raghuram Rajan: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీస్తున్న అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే అంశమే ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కీలక అంశమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఘర్షణ ప్రభావం ప్రపంచ ఇంధన సరఫరాపై స్పష్టంగా కనిపిస్తున్నదని, దాదాపు 15 నుంచి 20 శాతం వరకు సరఫరా అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొన్నదని ఆయన పేర్కొన్నారు. కొన్ని దేశాలు తమ నిల్వలను వినియోగిస్తూ తాత్కాలికంగా పరిస్థితిని నియంత్రిస్తున్నప్పటికీ, యుద్ధం సుదీర్ఘంగా సాగితే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ పరిస్థితుల్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆయన అంచనా వేశారు. ఒక బ్యారెల్ ధర 150 నుంచి 200 డాలర్ల వరకు చేరే అవకాశముందని, ఇది ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు. ఇప్పటికే అనేక దేశాలు ధరల భారాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, ఇంధన ధరల పెరుగుదల వల్ల వడ్డీ రేట్లు కూడా పెరిగే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇది సాధారణ ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపుతుందని ఆయన వివరించారు.
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. ఈ మార్గంలో ఎలాంటి అంతరాయం జరిగినా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై నేరుగా ప్రభావం పడే అవకాశముందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొనే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
భారతదేశం విషయానికి వస్తే.. దిగుమతి చేసుకునే ముడి చమురుపై అధికంగా ఆధారపడటం వల్ల ఈ పరిస్థితి మరింత ప్రభావం చూపే అవకాశముందని ఆయన తెలిపారు. చమురు ధరలు పెరగడం వల్ల విదేశీ లావాదేవీల లోటు పెరిగే ప్రమాదం ఉండటంతో పాటు, రూపాయి విలువపై కూడా ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించారు. దీర్ఘకాలంలో సబ్సిడీల ద్వారా వినియోగదారులను రక్షించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశాలు ముందుగానే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. చమురు నిల్వలను పెంచడం, ఇంధన వనరులను విభిన్నీకరించడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఒక హెచ్చరికగా తీసుకుని, దేశాలు తమ ఆర్థిక విధానాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చిచెప్పారు.
ALSO READ: Summer Plants: ఎండాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలు
Last Updated on March 21, 2026 · 8:34 PM by Star Trinethram



