Pawan Kalyan: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం మరోసారి రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విస్తృతంగా స్పందిస్తూ గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమలలో భక్తులకు ప్రసాదంగా అందించే లడ్డూ నాణ్యతపై గతంలోనే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో వచ్చిన ఆరోపణలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి విషయంలో జరిగిన అక్రమాలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై స్పందించిన వెంటనే తదుపరి చర్యలపై చర్చించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే నెయ్యి కల్తీకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ, వాటిపై పారదర్శక విచారణ జరగలేదని విమర్శించారు. తిరుమల వంటి పవిత్ర స్థలంలో తప్పు జరిగిందనే భావనతోనే తాను దీక్ష చేపట్టినట్లు స్పష్టం చేశారు.
నెయ్యి తయారీకి అవసరమైన పాలను సేకరించకుండా, అనుమానాస్పద సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. రసాయన పదార్థాల ద్వారా నెయ్యి తయారు చేయవచ్చని గత పాలకులు నిరూపించారని వ్యాఖ్యానించారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వమే నిబంధనలు సడలించి, తమకు అనుకూల సంస్థలకు ఒప్పందాలు ఇచ్చిందని విమర్శించారు.
కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రారంభంలోనే అంగీకరించి ఉంటే పరిస్థితి ఇంతగా విషమించేదేం కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా, నియమ నిబంధనలు మార్చి ఇష్టానుసారంగా టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. భక్తుల విశ్వాసంతో ముడిపడిన ఈ అంశంలో నిర్లక్ష్యం అసహనానికి దారి తీసిందని అన్నారు. తిరుమల ప్రసాదం పవిత్రతను కాపాడటం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. తిరుమల లడ్డూ నాణ్యత, నెయ్యి స్వచ్ఛత విషయంలో పారదర్శక వ్యవస్థ నెలకొల్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ALSO READ: CM Revanth Reddy: దేవాదుల సాక్షిగా మాకు పరిష్కారమే కావాలి
Last Updated on February 24, 2026 · 3:01 PM by Star Trinethram



