HomeENTERTAINMENTJabardasth: జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు!

Jabardasth: జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు!

📰 Generate e-Paper Clip

జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం గోరగనమూడి వద్ద అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దొరబాబు, రైజింగ్ రాజుతో పాటు కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

కాకినాడలో జనసేన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం దొరబాబు, రైజింగ్ రాజు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గోరగనమూడి సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు కాగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జబర్దస్త్ ఆర్టిస్టులకు రోడ్డు ప్రమాదం జరిగిందన్న వార్తతో వారి అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

RELATED ARTICLES

Most Popular