తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. గిగ్ వర్కర్లు తాము చేసే పని, పూర్తి చేసిన రైడ్లు, వాటి ద్వారా పొందే ఆదాయం వంటి వివరాలను తమ మొబైల్ ఫోన్లలోనే తెలుసుకునే హక్కును ఈ చట్టం కల్పిస్తుందని వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ గిగ్ వర్కర్స్ సామాజిక భద్రత, సంక్షేమ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
21వ శతాబ్దం డేటా ఆధారంగా నడుస్తోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల గురించి చర్చ జరుగుతోందని గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, ఉబర్ వంటి సంస్థలన్నీ డేటా ఆధారంగానే పనిచేస్తున్నాయని చెప్పారు. అయితే ఇంతకాలం గిగ్ వర్కర్లకు మాత్రం తమ పనికి సంబంధించిన డేటాను చూసుకునే అవకాశం లేకుండా పోయిందని అన్నారు.
కొత్త చట్టం ద్వారా గిగ్ వర్కర్లకు వారి వ్యక్తిగత పని వివరాలపై హక్కు కల్పిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వారికి ఈ విషయంలో భరోసా ఇస్తోందన్నారు. తాము ఎన్ని పనులు చేశాం, ఎన్ని రైడ్లు పూర్తి చేశాం, వాటికి ఎంత ఆదాయం వచ్చింది అనే వివరాలన్నీ ఇకపై మొబైల్ ఫోన్లోనే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర నగరాల్లో వైఫై సదుపాయంతో కూడిన ప్రత్యేక విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఎండలో గంటల తరబడి ప్రయాణిస్తూ వస్తువులను డెలివరీ చేసే కార్మికులకు సరైన విశ్రాంతి సదుపాయాలు ఉండటం లేదని ఆయన గుర్తుచేశారు.
కొత్తగా ఏర్పాటు చేయనున్న విశ్రాంతి కేంద్రాల్లో గిగ్ వర్కర్లు తమ వాహనాలను పార్క్ చేసుకోవడంతో పాటు కాసేపు కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, అవసరమైతే నిద్రపోవడానికి కూడా అవకాశం ఉంటుందని వివరించారు.ఈ పథకంలో భాగంగా గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారి సామాజిక భద్రత, సంక్షేమానికి ఈ చర్యలు దోహదపడతాయని భావిస్తున్నారు.
గతంలో తెలంగాణలో గిగ్ వర్కర్లతో సమావేశమైనప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను తన దృష్టికి తీసుకొచ్చారని రాహుల్ గాంధీ తెలిపారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని, వారికి అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చడమే వారి విధానమని, కార్మికులను బానిసలుగా చూసే ధోరణి ఉందని ఆరోపించారు.


