మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న అనిశ్చితి, యుద్ధ పరిస్థితులపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా తమ డిమాండ్లకు అంగీకరిస్తే మరో రెండు రోజుల్లోనే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. ఈ విషయంలో తుది నిర్ణయం అమెరికా చేతుల్లోనే ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు.
మధ్యవర్తుల ద్వారా ఇరాన్, అమెరికా పరస్పరం సందేశాలు పంపుకుంటున్నాయని బఘాయీ తెలిపారు. ఇరాన్ డిమాండ్లను అమెరికా అంగీకరిస్తుందా లేదా అన్నదానిపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. రెండు రోజుల్లోనే ఈ ప్రతిపాదనను అమలు చేసే అవకాశం ఉందని ఇది ఇరాన్ చిత్తశుద్ధికి నిదర్శనమని ఏఎఫ్పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ డిమాండ్లు నెరవేరితే హార్ముజ్ జలసంధిలో భద్రతను పునరుద్ధరించడంతో పాటు తక్కువ వ్యవధిలోనే చర్చల ప్రక్రియను తిరిగి ప్రారంభించవచ్చని చెప్పారు.
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా కొన్ని షరతులకు అంగీకరించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. హార్ముజ్ విషయంలో ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం కుదిరిన షరతులను అమెరికా గుర్తించాలని తెలిపారు. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక బలగాల సంఖ్యను తగ్గించడంతో పాటు, ఇటీవలి నెలల్లో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇరాన్, ఒమన్ చర్చించిన నౌకాయాన మార్గాలను కూడా గుర్తించాలని అరాగ్చీ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతిపాదన అమలు గడువును ఐదు రోజులకు తగ్గించాలని ఖతార్ ప్రతిపాదించిందని, ప్రస్తుతం దానిని రెండు రోజులకు కుదించే ప్రతిపాదనకు వచ్చామని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు ఐదో వంతు హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ఈ జలమార్గాన్ని మూసివేసి , దానిపై తన నియంత్రణను ప్రకటించింది. అనుమతి లేకుండా ఈ మార్గంలో ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకుంది. అయితే హార్ముజ్ జలసంధి తెరిచే ఉండాలని దానిపై ఇరాన్ ఏకపక్షంగా నియంత్రణ ప్రకటించలేదని అమెరికా స్పష్టం చేసింది.

