HomeOTHERSENTERTAINMENTరవితేజ సినిమా ఛాన్స్ మిస్సింగ్.. రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా..

రవితేజ సినిమా ఛాన్స్ మిస్సింగ్.. రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా..

📰 Generate e-Paper Clip

టాలీవుడ్‌లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న దివి వైద్య తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను తాజాగా వెల్లడించారు. ‘మహర్షి’ సినిమాతో నటిగా పరిచయమైన ఆమె, బిగ్‌బాస్‌ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ కార్యక్రమంలో తన అమాయకత్వం, ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకున్న దివి, బయటకు వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. అయితే తన సినీ ప్రయాణం ప్రారంభంలోనే మాస్ మహారాజా రవితేజ సరసన కథానాయికగా నటించే అవకాశం వచ్చిందని, కానీ అనుకోని కారణాలతో ఆ అవకాశం చేజారిపోయిందని ఆమె వెల్లడించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివి వైద్య, తనకు దర్శకుడు హరీష్ శంకర్ అందించిన ప్రోత్సాహాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన తనకు గురువులాంటి వారని, మంచి స్నేహితుడిగా అండగా నిలిచారని తెలిపారు. బిగ్‌బాస్‌ తర్వాత డిజిటల్‌ రంగంలో, వెబ్‌ సిరీస్‌లలో అవకాశాలు అందుకుంటూ గుర్తింపు పొందడానికి పరిశ్రమలోని ప్రముఖుల ప్రోత్సాహం కూడా దోహదపడిందని వివరించారు. రవితేజ సరసన నటించే అవకాశం వచ్చినప్పుడు ఎంతో సంతోషించానని, అయితే చివరి నిమిషంలో తనను ఆ పాత్ర నుంచి తప్పించడంతో తీవ్రంగా బాధపడ్డానని చెప్పారు. ఆ రాత్రి కన్నీళ్లు పెట్టుకున్నానని, ఆ సంఘటన తనను మానసికంగా కుంగదీసిందని వెల్లడించారు.

ఆ చేదు అనుభవం ఎదురైనా నిరాశకు లోనై ఆగిపోకుండా, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని దివి స్పష్టం చేశారు. పెద్ద చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించాలనే కోరిక తనకు ఉందని, దర్శకులు తనపై ఉంచే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. ప్రస్తుతం విభిన్నమైన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆమె, భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular