మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధం
తెలంగాణ రాజకీయాల్లో మార్పు స్పష్టం
పార్టీల్లో గ్రూపు రాజకీయాలు సహజమే
బీఆర్ఎస్ కుటుంబ గొడవలపై విమర్శ
బీజేపీకి ప్రధాన పోటీ కాంగ్రెస్తోనే
ప్రజల సమస్యలే బీజేపీ అజెండా
Dharmapuri Arvind: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీజేపీ పోటీ చేస్తుందని, అన్ని చోట్ల విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో బీజేపీకి బలమైన ఆదరణ ఉందని, అదే ఈ ఎన్నికల్లో ఫలితాల రూపంలో కనిపిస్తుందని అన్నారు.
తాను, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిసి రాజకీయంగా ముందుకు వెళ్తే బీఆర్ఎస్ పూర్తిగా గల్లంతు కావడం ఖాయమని ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజలు బీఆర్ఎస్ పాలనపై విసుగు చెందారని అన్నారు. రాబోయే ఎన్నికలు ఈ మార్పుకు నిదర్శనంగా నిలుస్తాయని చెప్పారు.
రాజకీయ పార్టీల్లో అంతర్గత విభేదాలపై స్పందించిన ఆయన.. ఏ పార్టీలో అయినా గ్రూపు రాజకీయాలు, అభిప్రాయ భేదాలు సహజమేనని అన్నారు. బీఆర్ఎస్లో కుటుంబ అంతర్గత గొడవలు, కాంగ్రెస్లో మంత్రుల మధ్య తలెత్తుతున్న విభేదాలను ప్రజలు చూస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ ఆయా పార్టీల బలహీనతలను బయటపెడుతున్నాయని అభిప్రాయపడ్డారు.
అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే ఇన్చార్జులను రంగంలోకి దింపిందన్నారు. ఎన్నికల వ్యూహం ముందుగానే సిద్ధం చేసుకున్నామని, అభ్యర్థుల ఎంపిక కూడా తుది దశకు చేరుకుందని తెలిపారు. రేపో మాపో అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లలో తమకు కాంగ్రెస్తోనే ప్రధాన పోటీ ఉంటుందని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ప్రజలు ఇప్పటికే ఆ పార్టీని పక్కన పెట్టారని అభిప్రాయపడ్డారు.
గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తున్నామని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల సమస్యలే తమ ప్రధాన అజెండా అని, అభివృద్ధి, పారదర్శక పాలన హామీలతో ప్రజల ముందుకు వెళ్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా తెలంగాణలో ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం అనంతరం షెడ్యూల్ను ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో ఒకే రోజున ఎన్నికలు జరగనున్నాయని ఎస్ఈసీ స్పష్టం చేశారు. అవసరమైతే ఫిబ్రవరి 12న రీ పోలింగ్ నిర్వహించి, మిగతా స్థానాలతో పాటు ఓట్ల లెక్కింపు చేస్తామని తెలిపారు.
ALSO READ: Trap: ఇన్స్టాలో పరిచయమైన యువకుడితో హోటల్కి వెళ్లిన యువతి.. తర్వాత దారుణం
Last Updated on January 27, 2026 · 2:08 PM by Star Trinethram



